జీవితం అంటే ఒక అందమైన అనుభవం కావాలి. అయితే అది అందరికీ అలా జరుగుతుందని చెప్పలేం. అలా జరగాలని కోరుకోవడంలో మాత్రం తప్పులేదు. అందుకు ఏం చేయాలన్న దాని గురించి నటి కాజల్ అగర్వాల్ ఏం చెబుతుందో చూద్దాం. కాజల్ ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా శ్రమించాల్సి వచ్చిందట. ఇప్పుడు అగ్ర కథానాయికల్లో ఒకరిగా రాణిస్తున్న కాజల్‌అగర్వాల్ తమిళంలో కమలహాసన్‌కు జంటగా ఇండియన్–2 చిత్రంలో నటిస్తోంది. ఆమె నటించిన ఫ్యారిస్ ఫ్యారిస్ చిత్రం విడుదల కావలసి ఉంది. తెలుగులోనూ పలు చిత్రాల్లో నటిస్తోంది.
ఈ సందర్భంగా కాజల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పని ఒత్తిడి తగ్గించుకోవాలని, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని, కొందరు నటీమణులు జపిస్తుంటారని అంది. ప్రతి విషయంలోనూ తమకు నచ్చినట్టుగా ఉండాలని ఆశ పడుతుంటారని పేర్కొంది. ప్రస్తుతం తానూ అలాగే భావిస్తున్నానని అంది. మన చుట్టూ చాలా వ్యతిరేక శక్తులు ఉంటాయని, అలాంటి వాటిపై కొందరు ఆసక్తి చూపుతుండడం గమనించినట్లు చెప్పింది.
ఇతరులపై వ్యతిరేకతలన్నవి వినడానికి బాగానే ఉన్నా, మన వరకూ వచ్చే సరికి వాటిని తట్టుకోవడం కష్టం అని చెప్పింది. అందుకే తాను చెడుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. తప్పుడు ఆలోచనలను మనసులోకి రాకూడదని, అందుకు ఉదయం లేచినప్పటి నుంచి మంచి విషయాల గురించి చదవడం, చూడడం వంటివి చేస్తే ఆ రోజంతా బాగుంటుందని అంది.
అదేవిధంగా ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం, అలా మాట్లాడేవారిని ప్రోత్సహించడం కూడా తప్పని పేర్కొంది. అసలు అలాంటి వారి మాటల్ని నమ్మడం ఇంకా తప్పు అని అంది. అలాంటి తప్పులు చేస్తే మన ప్రశాంతతకే భంగం కలగుతుందని, మనసు అశాంతికి గురవుతుందని కాజల్ అగర్వాల్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment