
కాజల్ దృష్టిలో... రిటైర్మెంట్‌కి రెడీగా ఉన్న నాయిక?
నటన మాత్రమే కాదు, మీడియాను ఫేస్ చేయడం కూడా ఆర్టిస్టులకు ఛాలెంజే. అందుకే చాలా జాగ్రత్తగా మీడియా దగ్గర మాట్లాడుతుంటారు. అయితే నిర్మొహమాటంగా మనసులో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. వాళ్లల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. ఇటీవల ఓ కోలీవుడ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్‌వ్యూలో కాజల్ సమాధానాలు వింటే... అది నిజమని ఎవరైనా అంగీకరిస్తారు. ఇప్పటికిప్పుడు దక్షిణాది కథానాయికల్లో రిటైర్ అవ్వడానికి రెడీగా ఉన్న నాయిక ఎవరు? అని అడిగితే -‘శ్రీయ’ అని తడుముకోకుండా సమాధానమిచ్చేశారు కాజల్. శ్రీయ రిటైర్ అవుతున్నట్లు ప్రకటించనేలేదు.
ప్రస్తుతం కాజల్‌కి ఉన్న పోటీదారుల్లో శ్రీయ లేదు కూడా. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు కూడా పెద్దగా లేవనే చెప్పాలి. మరి అలాంటప్పుడు అంత నిక్కచ్చిగా శ్రీయ పేరు ఎలా చెప్పగలిగింది కాజల్ అంటూ కోలీవుడ్‌లో ఒకటే చర్చ. ఇదే ఇంటర్‌వ్యూలో.. ‘తమిళ హీరోల్లో ఫ్యాషన్‌ని ఫాలో అయ్యే స్టయిల్ ఐకాన్ ఎవరు?’ అనే ప్రశ్నకు కాజల్ ఇచ్చిన సమాధానం ‘విజయ్’. ‘‘‘తుపాకీ’లో విజయ్ స్టయిల్ చూసి ఫ్యాన్ అయిపోయా’’ అని విజయ్‌ని ఈ సందర్భంలో పొగడ్తల్లో ముంచెత్తారు కాజల్. చివరిగా అడిగిన ప్రశ్న... పారితోషికం తీసుకోకుండా నటించాల్సి వస్తే ఏ హీరోతో నటిస్తారు? అనడిగితే... ‘సూపర్‌స్టార్ రజనీకాంత్’ అని తడుముకోకుండా చెప్పి ఇంటర్‌వ్యూని ముగించారు కాజల్.