కల్యాణ్‌రామ్
‘‘కమర్షియల్ హీరోకు ఫిజికల్‌గా కష్టం ఉంటుంది. ఫైట్స్ చేయాలి, దూకాలి, అరవాలి. రొమాంటిక్ హీరోకి మైండ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. మనసులోనే ఆలోచించుకొని యాక్ట్ చేయాలి. దేని కష్టం దానిలో ఉంది. రెండూ రెండే. కాకపోతే.. హీరోయిన్‌తో కెమిస్ట్రీ వర్కవుట్ అయితే రొమాంటిక్ హీరోగా చేయడం ఈజీ’’ అని కల్యాణ్‌రామ్ అన్నారు. కల్యాణ్‌రామ్, తమన్నా జంటగా జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నా నువ్వే’. మహేశ్ కోనేరు సమర్పణలో కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి నిర్మించిన ఈ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా కల్యాణ్‌రామ్ పంచుకున్న సంగతులు...
► కమర్షియల్ సినిమాల్లో హీరో బాడీలాంగ్వేజ్ స్పీడ్‌గా ఉంటుంది. ‘నా నువ్వే’లాంటి రొమాం టిక్ సినిమాలు చేసేటప్పుడు కొంచెం సెటిల్డ్‌గా ఉండాలి. కళ్లు పెద్దవి చేయకూడదు. హ్యాండ్ మూమెంట్స్ ఎక్కువ ఉండకూడదు. తల ఎక్కు వ ఊపకూడదు. డైలాగ్స్ మధ్య గ్యాప్ ఇవ్వాలి. డైలాగ్ కంటే ఎక్స్‌ప్రెషన్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ నాకు కొత్తగా అనిపించాయి.
► నా పాత్ర కోసం ఎవర్నీ ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోలేదు. జయేంద్రగారి మైండ్ నుంచి వచ్చిన పాత్ర ఇది. క్యారెక్టర్‌తో సింక్ అవ్వడానికి నాకు చాలా టైమ్ పట్టింది. ఆయన చెప్పినట్టు చేసుకుంటూ వెళ్లాను. ‘నా నువ్వే’ లాంటి రొమాంటిక్ సినిమా చేయడం నాకు ఫస్ట్ టైమ్. ‘గీతాంజలి’ సినిమా చూసినప్పటి నుంచి పీసీ శ్రీరామ్‌గారితో పని చేయాలనుకునేవాణ్ణి. ‘నా నువ్వే’తో నా కల నెరవేరింది.
► అమెరికాలో జాబ్ కోసం వెళ్తున్న ఓ కుర్రాడిగా నేను కనిపిస్తాను. నా పాత్రలో కాస్త స్వార్థం కూడా ఉంటుంది. నా కెరీర్ స్టార్టింగ్‌లో ‘నా నువ్వే’ లాంటి సినిమా చేసుంటే బాగుండేది. ఈ సినిమాలో నా లుక్ అందరికీ నచ్చింది. నా కొడుకు కూడా నేను చాలా అందంగా ఉన్నానని మెచ్చుకున్నాడు. నాకొచ్చిన పెద్ద కాంప్లిమెంట్ అదే. నేను మీసం తీసేయడం నా భార్యకు కూడా నచ్చింది.
► తమన్నాతో పని చేయడం చాలా బాగుంది. ఆమె చాలా ప్రొఫెషనల్. సెట్స్‌లో టైమ్‌కు ఉంటుంది. టోటల్ సీన్‌ను సింగిల్ షాట్‌లో తీయడం జయేంద్రగారికి అలవాటు. మొత్తం సీన్ అయ్యాకే కట్ చెబుతారు. అందుకే తమన్నా, నేను షూటింగ్‌కు ముందు చాలా ప్రాక్టీస్ చేశాం. కిరణ్, విజయ్, మహేశ్ ఈ సినిమాను కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.
► ఏడాదికి ఇన్ని సినిమాలు చేయాలనే టార్గెట్ పెట్టుకోలేదు. నా మైండ్ సెట్ ప్రకారం చేస్తుంటా. ఓ సినిమా చేస్తున్నప్పుడు మరో కథ నచ్చితే చేసేస్తా. ప్రస్తుతం కేవీ గుహన్‌తో ఓ సినిమా చేస్తున్నాను. అది పూర్తిగా కొత్త కాన్సెప్ట్. ఏదో ఒక ఫ్రేమ్‌కు ఫిక్స్ అయిపోవడం నాకిష్టం ఉండదు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై పవన్ సాదినేని దర్శకత్వంలో మల్టీస్టారర్ మూవీ ఉంటుంది. గుణ్ణం గంగరాజుగారు డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తారు. వచ్చే ఏడాది తారక్‌తో కూడా ఓ సినిమా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment