మరో చాన్స్
ఇవన్ వేరమాదిరి చిత్రంలో కోలీవుడ్‌కే చెందిన కన్నడ బ్యూటీ సురభి నటించింది. ఈ చిత్రంలో పక్కింటి అమ్మాయిగా మంచి నటనను ప్రదర్శించి మార్కులు కొట్టేసిన ఈ భామకు మరిన్ని అవకాశాలు తలుపుతడుతున్నాయి. రెండవ చిత్రంగా దర్శకుడు సుశీంద్రన్ దర్శకత్వంతో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఆదలాల్ కాదల్, పాండియనాడు వంటి విజయవంతమైన చిత్రాల తరువాత సుశీంద్రన్ దర్శకత్వం వహించనున్న చిత్రానికి జీవా అనే టైటిల్‌ను ఖరారు చేశారు. విష్ణువిశాల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్‌పైకి రానుంది. మరో విషయమేమిటంటే సుశీం ద్రన్, విష్ణువిశాల్ కాంబినేషన్‌లో ఇంతకు ముందు వెన్నెలకబడికుళు వంటి హిట్ చిత్రం వచ్చింది. ఈ చిత్రం కబడ్డీ క్రీడ నేపథ్యంలో తెరకెక్కగా తాజా చిత్రం క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందటం విశేషం. ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం గురించి నటి సురభి మాట్లాడుతూ సుశీంద్రన్, విష్ణు విశాల్ కాంబినేషన్‌లో నటించడానికి చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నానని చెప్పింది. ఈ చిత్రం తప్పకుండా వేరే స్థాయికి తీసుకు వెళుతుందనే నమ్మకం ఉందని చెప్పింది. తన తొలి చిత్రం ఇవన్ వేర మాదిరికి ఈ చిత్రం పూర్తి డిఫరెంట్‌గా ఉంటుందని పేర్కొంది. ఇందులో తాను సిటీ అమ్మాయిగా నటించనున్నట్లు తెలిపింది. నటుడు విష్ణు విశాల్ మాట్లాడుతూ సుశీంద్రన్ దర్శకత్వంలో రెండేళ్ల క్రితమే వీర ధీర సూర అనే చిత్రంలో నటించాల్సి ఉందన్నారు. కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం ప్రారంభంకాలేదని వెన్నెల కబడ్డికుళు చిత్రం తరువాత మళ్లీ ఇప్పుడు జీవా చిత్రాన్ని సుశీంద్రన్ దర్శకత్వంలో చేయడం సంతోషంగా ఉందన్నారు.