
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ వృత్తిగత, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలో ఆయన తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.. ప్రముఖ నటుడు రిషీకపూర్ నటించిన తొలి చిత్రం బాబీలోని ‘మెయిన్ సాయిర్ తో నహిన్’ అనే పాట వీడియోలో రిషికపూర్ ముఖాన్ని.. తన ముఖంగా కరణ్ ‘ఫేస్ మ్యాపింగ్’ చేశారు. అసలు ఎవరు గుర్తు పట్టలేనంతగా కరణ్.. అచ్చం రిషికపూర్‌లా హావభావాలు పలికించారు.
ఈ వీడియోకు కరణ్..‘‘ఫేస్ మ్యాపింగ్’ మ్యాజిక్ ఇది. రాజ్‌కపూర్ ఏప్పటికీ నా అభిమాన నిర్మాత. అదేవిధంగా నేను ఆరాధించే నటుడు రిషి కపూర్. ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీకు అనుమతి ఉంది’ అని కామెంట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కరణ్ పోస్ట్ చేసిన ఈ వీడియోపై రిషికపూర్ కుమార్తె రిద్దిమాకపూర్ స్పందించి.. ఈ వీడియో తయారు చేసిన కరణ్‌ను అభినందిస్తున్నట్లు క్లాప్స్ కొట్టే ఎమోజీని కామెంట్‌గా జతచేశారు. ఈ వీడియోపై పలువురు సినీ ప్రముఖులతో పాటు నెటిజన్లు కూడా కరణ్‌ను అభినందిస్తూ కామెంట్లు చేశారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలువుతన్న ఈ సమయంలో కరణ్‌జోహర్ తన పిల్లలు యష్, రూహీలతో గడుపుతున్నారు.