సాక్షి, తిరువనంతపురం : నటి అన్నా రాజన్, మమ్మూటి అభిమానులకు క్షమాపణలు చెప్పేసింది. మాలీవుడ్ మెగాస్టార్ అయిన మమ్మూటీని ఉద్దేశించి ఓ టీవీ షోలో ఆమె వ్యంగ్య కామెంట్లు చేసింది. దీంతో స్టార్ హీరో ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేయగా.. కన్నీటితో సారీ చెబుతూ ఫేస్‌బుక్‌లో వీడియో సందేశాన్ని అందించింది.
మమ్మూటి, ఆయన తనయుడు సల్మాన్ దుల్కర్‌లలో అవకాశం వస్తే ఎవరికి జోడీగా నటిస్తారని ఓ టీవీ షో కార్యక్రమంలో పాల్గొన్న రాజన్‌ను యాంకర్ ప్రశ్నించింది. దీనికి సమాధానంగా దుల్కర్‌తో నటించాల్సి వస్తే అందులో మమ్మూటీ తండ్రిగా నటించాలని కోరుకుంటున్నట్లు వెటకారంగా మాట్లాడింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మమ్మూటీ ఫ్యాన్స్.. ఆమె తండ్రిని సైతం వదలకుండా ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో తీవ్ర పోస్టులు పెట్టేశారు. దీంతో దిగొచ్చిన అన్నా ఎట్టకేలకు క్షమాపణలు చెప్పింది.
‘మమ్మూటీ సర్‌ను కించపరిచేలా నేను మాట్లాడలేదు. ఎలాంటి కామెంట్లు చేయలేదు. దుల్కర్‌కు జోడీగా నటించాల్సి వస్తే అందులో మమ్మూటీ.. దుల్కర్‌కు తండ్రిగా నటించాలని కోరుకుంటున్నట్లు, మమ్మూటీతో కూడా జోడీగా నటించుకుంటున్నట్లు నేను చెప్పాను. కానీ, ఆ ప్రోగ్రాం నిర్వాహకులు టీఆర్పీ కోసం మొదటి సగం వరకే చూపించారు. ఫలితం నాపై తీవ్ర స్థాయిలో పడింది. అంతా ఇష్టం వచ్చినట్లు తిట్టారు. వారిద్దరినీ నేను అవమానించేలా మాట్లాడలేదు. క్షమించండి’ అని వీడియోలో కోరింది.
అన్నా రాజన్ అలియాస్ లిచీ.. నటించింది రెండు చిత్రాలే అయినా రెండు కూడా హిట్లు కావటంతో మంచి పేరు సంపాదించుకుంది. తాజా చిత్రం వెలిపండిట్ పుసక్తంలో మోహన్‌లాల్(57 ఏళ్లు) వైఫ్‌గా నటించి మెప్పించింది కూడా. ఈ క్రమంలోనే యాంకర్ లిచీ కన్నా 41 ఏళ్లు పెద్దయిన మమ్మూటీ ప్రస్తావన తేవటం.. అది కాస్త ఇలా వివాదాస్పదం అయ్యిందన్న మాట.