
కృష్ణంరాజు
‘‘నటుడిగా 50 ఏళ్లు ప్రయాణం చేశాను. ఇంకా ప్రయాణం కొనసాగిస్తూనే ఉంటాను. ఎన్నో అద్భుతమైన సినిమాలు, పాత్రలు చేశాను. ఇప్పుడు కూడా అలాంటి పాత్రలే పోషించాలనుకుంటున్నాను. అలాగే రాజకీయాల్లో కూడా పార్టీ ఎలా కోరుకుంటే అలా ప్రయాణం చేస్తాను’’ అని నటులు కృష్ణంరాజు అన్నారు. ఇవాళ ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా కృష్ణంరాజు సినిమా, రాజకీయాలకు సంబంధించిన పలు విశేషాలను ఇలా పంచుకున్నారు..
► బర్త్‌డే ఫంక్షన్స్ అంటూ ప్రత్యేకంగా ఏం లేవు. ఫ్యాన్స్ వస్తారు. ఫ్రెండ్స్ విష్ చేస్తారు. మామూలుగానే ఉంటుంది. నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సౌత్, నార్త్‌కు సంబంధించిన సెలబ్రిటీస్ అందర్నీ పిలిచి ఓ ఫంక్షన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ఈ ఫంక్షన్ ఎప్పుడో చేయాలనుకున్నా కుదర్లేదు. మాతో ప్రయాణం కొనసాగిస్తున్న అభిమానులనూ సన్మానించాలనుకుంటున్నాను. త్వరలోనే ఆ వివరాలు తెలియజేస్తా.
► ఆ మధ్య కర్ణాటక ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేశాను. ఆంధ్రా ఎన్నికలు ఇంకా హీట్ ఎక్కలేదు. పార్టీ అడిగితే ప్రచారం చేస్తాను. సంక్రాంతికి మా ఊరు వెళ్లి సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాం. పార్టీ పనిమీద ఢిల్లీ వెళ్లి వచ్చాను. ఊరెళ్లడం కుదర్లేదు.
► నటుడిగా మంచి పాత్రలు ఎంపిక చేసుకోవాలి అనుకుంటున్నాను. అలా వచ్చి వెళ్లిపోయే పాత్రలు చేయాలని లేదు. మన పాత్ర కథకు, సినిమాకు కీలకంగా ఉండాలి. అందుకే పాత్రల ఎంపికలో జాగ్రత్తగా ఉంటున్నాను. ఓ 2 సినిమాలు డిస్కషన్‌లో ఉన్నాయి. త్వరలోనే ప్రకటిస్తాను.
► ‘మహానటి’ సినిమా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. డైరెక్టర్ నాగీ, కెమెరామేన్ డ్యానీ అద్భుతంగా చేశారు. కీర్తీ సురేశ్‌కి అయితే ఫుల్ మార్క్స్. సావిత్రి జీవితంలో ఎత్తుపల్లాలను చూపించారు కాబట్టి బావుంది. యస్వీఆర్‌గారి బయోపిక్ చూడాలనుంది. ఆ పాత్రని ప్రకాశ్‌రాజ్ చేయగలడేమో అని అనుకుంటున్నాను.
► గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ మీద ప్రభాస్‌తో ఓ లవ్‌స్టోరీ చిత్రం నిర్మిస్తున్నాం. ఆ సినిమా ఓ షెడ్యూల్ పూర్తి అయింది. అందులో ఓ కీలక పాత్ర చేస్తున్నాను. కథలు కుదిరితే కచ్చితంగా గోపీకృష్ణ మూవీస్ బ్యానర్‌పై నిర్మాణం కొనసాగిస్తాం.
► మన బిడ్డను ఐదేళ్ల వరకూ దేవుడిలా చూడాలి.. ఐదు నుంచి పద్దెనిమిదేళ్ల వరకూ సేవకుడిలా చూడాలి.. ఆ తర్వాత స్నేహితుడిలా చూడాలని మా నాన్నగారు నాకు చెబుతుండేవారు. నాకు, ప్రభాస్‌కి మధ్య అనుబంధం బావుంటుంది.
► యాక్టర్‌గా 50 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను.. ఇండస్ట్రీలో పెద్దగా మార్పులేం రాలేదు. అలానే కష్టపడుతున్నారు. అప్పటి హీరోస్ అందరం బాగానే ఉండేవాళ్లం. ఇప్పుడు యంగ్ హీరోస్ కూడా బావుంటున్నారు. మహేశ్, ఎన్టీఆర్, చరణ్ వీళ్లందర్నీ చూస్తూనే ఉన్నాం కదా. మా వాడు (ప్రభాస్) కూడా అందరితో బావుంటాడు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు? అని అందరూ నన్ను అడుగుతూనే ఉన్నారు. ‘సాహో’ సినిమా తర్వాత కచ్చితంగా ఉంటుంది.
► ‘బాహుబలి’ తర్వాత తెలుగు సినిమా ఖ్యాతి జాతీయంగా కాదు అంతర్జాతీయంగా పెరిగింది. అందరూ మన సినిమాలవైపు చూస్తుండటం చాలా సంతోషంగా ఉంది.
► ‘సాహో’ సినిమా చాలా భారీ లెవల్లో తీస్తున్నారు. మొన్నామధ్య దుబాయ్ వెళ్లి ఫైట్ సీన్స్ తీశారు. సినిమా చాలా బాగా వస్తోందట.
► కన్నడలో అంబరీష్ చనిపోవడం నాకు బాధ కలిగించింది. ఆరోగ్యం బాలేనప్పుడు కూడా చాలాసార్లు కలిశాను. వాణ్ని కన్నడలో రెబల్ స్టార్ అంటారు. నా పిక్చర్స్ కొన్ని రీమేక్ కూడా చేశాడు. ‘గురువుగారు’ అని పిలుస్తుంటాడు నన్ను.
Comments
Please login to add a commentAdd a comment