శ్రీదేవి మృతి పట్ల మాలీవుడ్‌ విచారం | Malayalam film industry mourns Sridevi's demise | Sakshi
Sakshi News home page

శ్రీదేవి మృతి పట్ల మాలీవుడ్‌ విచారం

Published Sun, Feb 25 2018 2:00 PM | Last Updated on Sun, Feb 25 2018 2:00 PM

Malayalam film industry mourns Sridevi's demise  - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తిరువనంతపురం: అందాల నటి శ్రీదేవి అకస్మాత్తుగా మృతిచెందడంతో మలయాళ చిత్ర పరిశ్రమ(మాలీవుడ్‌) విచారం వ్యక్తం చేసింది. శ్రీదేవి మొత్తం 26 మలయాళ చిత్రాల్లో నటించారు. 1969లో వచ్చిన కుమార సంభవం ఆమె మొదటి మలయాళ చిత్రం. 1996లో వచ్చిన దేవరాగం ఆమె చివరి మలయాళ చిత్రం. పూంపట్ట(1971) చిత్రానికి గానూ మొదటిసారి బెస్ట్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కేరళ స్టేట్‌ నుంచి  అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత మరో రెండు అవార్డులు కూడా దక్కాయి. దుబాయ్‌లో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో శ్రీదేవి శనివారం రాత్రి 11.30 గంటలకు మృతిచెందిన సంగతి తెల్సిందే.

శ్రీదేవి మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విచారం వ్యక్తం చేశారు. శ్రీదేవి మరణం సినీ లోకానికి తీరని నష్టమని వ్యాఖ్యానించారు. బాలనటిగా విభిన్న పాత్రలు వేసి అందరి మనసుల్లో చోటుదక్కించుకున్నదని అన్నారు. ఇదొక గుండెకు నొప్పి కలిగించే వార్తని వెటరన్‌ నటుడు రాఘవన్‌ అన్నారు. సినిమాల పట్ల ఆమె పట్టుదల, అంకితభావం చాలా విలువైందని వ్యాఖ్యానించారు. తన నటనతో సినీ అభిమానులను మంత్రముగ్గుల్ని చేసిందని, ఆమె జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోనివని నటుడు జగదీశ్‌ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement