సాక్షి, ముంబై : ‘రోడ్డుపై ప్లాస్టిక్ ఎందుకు పారేస్తున్నారు? డస్ట్‌బిన్ ఉపయోగించండి’ అంటూ ఓ వ్యక్తిపై అరుస్తున్న వీడియోను షేర్ చేసి విరుష్కలు వార్తల్లో నిలిచారు. అయితే చాలా మట్టుకు నెటిజన్లు అనుష్క, విరాట్ కోహ్లిలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న విషయాన్ని పబ్లిసిటీ కోసం రాద్ధాంతం చేశారని తిట్టిపోస్తున్నారు. అయితే అనుష్క నోరు పారేసుకున్న ఆ వ్యక్తి అర్హాన్ సింగ్ గురించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు వెలుగు చూసింది.
అర్హాన్ సింగ్.. 90వ దశకంలో బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించాడు. షారుఖ్ ఖాన్-మాధురీ దీక్షిత్ జోడీగా నటించిన ‘ఇంగ్లీష్ బాబు దేశీ మేమ్’లో హీరో మేనల్లుడి పాత్రలో అర్హాన్ నటించి మెప్పించాడు. అంతేకాదు రాజా, దేఖ్ బాయ్ దేఖ్, 2010లో షాహిద్ కపూర్ హీరోగా నటించిన ‘పాఠశాల’లోనూ అర్హాన్ నటించాడు. ప్రస్తుతం అర్హాన్ సింగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారటంతో అతనికి సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
క్షమాపణలు చెబుతూ... తాను చేసిన తప్పుపై అర్హాన్ సింగ్ ఫేస్‌బుక్ ద్వారా క్షమాపణలు చెప్పారు. అయితే, అనుష్క, విరాట్ తన పట్ల ప్రవర్తించిన తీరును మాత్రం విమర్శించాడు. ‘నేను రోడ్డుపై పడేసిన చెత్త కంటే.. అనుష్క నోట్లో నుంచి వచ్చిన చెత్తే ఎక్కువగా ఉంది. సెలబ్రిటీ అయివుండి కనీస స్పృహలేకుండా నాపై కేకలు వేసింది. ఇది మర్యాద అనిపించుకోదు’ అని పేర్కొన్నారు. ఈ ఘటనపై అర్హాన్ తల్లి కూడా తీవ్రంగా స్పందించారు. తన కుమారుడు చేసింది తప్పేనని, కానీ.. అతన్ని పట్టుకుని రోడ్డుపై తిట్టడం సబబు కాదని అర్హన్ తల్లి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment