నాన్నగారి దగ్గర నుంచి క్రమశిక్షణ..
కొవ్వూరు : సినిమా రంగంలో క్రమశిక్షణ ముఖ్యమని, నాన్న మమ్మల్ని ఎంతో క్రమశిక్షణతో పెంచారని, ఆయన పెంపకమే మా అభివృద్ధికి కారణమని ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు తనయుడు, హీరో మంచు మనోజ్ అన్నారు. హీరోగానే కాకుండా విలన్‌గా, ఇతర ప్రధాన పాత్రల్లో కూడా నటించేందుకూ తాను సిద్ధమేనని చెప్పారు. కొవ్వూరు మండలం కుమారదేవంలో శౌర్య చిత్రం షూటింగ్‌లో పాల్గొన్న ఆయన కొద్దిసేపు సాక్షితో ముచ్చటించారు.
ప్ర: మీపై మీ నాన్నగారి ప్రభావం ఎంత
జ: వృత్తిలో క్రమశిక్షణ చాలా ముఖ్యం, నాన్నగారి దగ్గర నుంచి క్రమశిక్షణతో ఉండడం నేర్చుకున్నాం. ఆయన పెంపకమే మమ్మల్ని ఇంతటి స్థితిలో నిలిపింది.
ప్ర: ప్రస్తుతం మీరు నటిస్తున్న సినిమాలు
జ : రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో అటాక్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. డిసెంబర్‌లో విడుదల అవుతుంది. ప్రస్తుతం దశరధ్ దర్శకత్వంలో శౌర్య చేస్తున్నాను. కొన్ని సినిమాలు కథలు రెడీగా ఉన్నాయి.
ప్ర: మీకు ఇష్టమైన క్యారెక్టర్
జ : పోలీస్ అధికారిగా నటించడం అంటే ఎంతో ఇష్టం. నటుడిగా అన్ని పాత్రలూ చేయూలని ఉంది. హీరోగానే కాదు విలన్‌గా, ఇతర ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కూడా నటించేందుకు సిద్ధంగా ఉన్నా. కథ కుదిరితే మరోసారి మా కుటుంబ సభ్యులతో కలిసి నటిస్తా.
ప్ర : ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో నటించారు
జ : 14 సినిమాల్లో నటించాను
ప్ర: మీ సినిమాల్లో మీకు అత్యంత ఇష్టం అయినా చిత్రం
జ: అన్ని సినిమాల కన్నా ప్రస్తుతం నటిస్తున్న శౌర్య సినిమా ది బెస్ట్‌గా నిలుస్తుంది.
ప్ర: శౌర్య సినిమా గురించి చెబుతారా
జ : హీరోగా నాది, హీరోయిన్ రెజీనా, ప్రకాష్‌రాజ్‌లది ఓ వినూత్నమైన పాత్రలు. ప్రేక్షకులు కొత్త రకమైన సినిమాను చూస్తారు. దర్శకుడు దశరధ్ కొత్తదనంతో తెరకెక్కిస్తున్నారు.
ప్ర: గోదావరి తీరం ఎలా ఉంది.
జ: గోదావరి తీరం అంటే చాలా ఇష్టం. ఇక్కడి వంటకాలతో పాటు ప్రజల ఆప్యాయతలు ఎంతగానో నచ్చుతాయి.