ప్రముఖ దర్శకుడు మణిరత్నం తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు గుండెపోటు రావడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. మణిరత్నంకు గుండెపోటు రావడం ఇది నాలుగోసారి. దీంతో ఆయన అభిమానులు కంగారు పడుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. మణిరత్నంకు తొలిసారి 2004లో యువ సినిమా షూటింగ్ సమయంలో గుండెపోటు వచ్చింది. సెట్‌లోనే ఛాతిలో నొప్పి రాగా, వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఆ తర్వాత 2015లో ఓకే బంగారం సినిమా షూట్ సందర్భంగా రెండోసారి కశ్మీర్‌లో గుండెపోటుకు గురయ్యారు. కశ్మీర్ నుంచి వెంటనే ఢిల్లీకి తరలించి చికిత్సను అందించడంతో ఆయన కోలుకొన్నారు. 2015 తర్వాత ఆరోగ్యంగా కనిపించినప్పటికీ 2018లో మళ్లీ గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చేరినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా నాలుగోసారి గుండెపోటుకు గురయ్యారు.
ప్రస్తుతం మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ అనే చారిత్రాత్మక చిత్రంపై పనిచేస్తున్నారు. ఈ చిత్రంలో భారీ రేంజ్‌లో అగ్రనటులను రంగంలోకి దించుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ నటించడానికి ఒకే చెప్పారు. ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment