సాక్షి, చెన్నై: నాకు పెళ్లెప్పుడవుతుంది అని కూనిరాగాలు తీస్తోంది నటి మంజిమామోహన్. ఆ కథేంటో చూద్దామా! ‘అచ్చంయంబ్బదు మడమయడా’ చిత్రంతో తమిళంలోనూ, అదే చిత్రంతో తెలుగులోనూ ఏకకాలంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన లక్కీబ్యూటీ మంజిమామోహన్. ప్రస్తుతం హిందీ చిత్రం క్వీన్ మలయాళ రీమేక్‌లోనూ, తమిళంలో గౌతమ్‌కార్తీక్‌కు జంటగా దేవాట్టం చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్న ఈ వర్ధమాన నటి సాక్షితో ప్రత్యేకంగా ముచ్చటించారు.
ప్ర: నటి కాకపోతే ఏమై ఉండేవారు?
జ: నేను 10వ తరగతి చదువుతున్న సమయంలోనే ఫ్యాషన్ డిజైనర్ కావాలని ఆశపడ్డాను. పది పూర్తి అయిన తరువాత వేసవి సెలవుల్లో రెండు నెలలు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు నేర్చుకునే ప్రయత్నం చేశాను. అయితే అప్పుడే ఈ రంగంలో నేను పనికి రానని అర్థం అయిపోయింది. దీంతో ఆ ఆశకు నీళ్లొదిలేశాను.
ప్ర: స్టెల్లా మేరీ కళాశాల విద్యార్థిని అయిన మీకు అప్పటి చెన్నైకి, ఇప్పటి చెన్నైకి ఏమైనా వ్యత్యాసం అనిపిస్తుందా?
జ: కచ్చితంగా. కాలేజీ జీవితం అంటేనే వేరు కదా! అప్పుడు నేను బస్, ఆటోల్లో ప్రయాణం చేసేదాన్ని. ఇప్పుడు అలా కుదరదు. ఒక చోట 10మంది ఉంటే అందులో కనీసం ముగ్గురైనా నన్ను గుర్తు పడతారు. అందువల్ల ఇప్పుడు అంత స్వేచ్ఛగా తిరగడం కుదరదు. అయితే అలాంటి సందర్భం వస్తే చెన్నైలోని ఎంటీసీ బస్సులో పయనించాలన్న కోరిక ఉంది.
ప్ర: షూటింగ్ లేని సమయాల్లో మీకు కాలక్షేపం?
జ: బాగా నిద్ర పోతాను. కుదిరితే రోజంతా నిద్రలోనే గడిపేస్తా. ఏదైనా సినిమా చూస్తాను. పాటలు వింటాను. ఇటీవల యోగా చేస్తున్నాను. ఆరోగ్యంగా ఉండడానికి యోగా చాలా ఉపయోగ పడుతోంది. నాకు వంటింటి పరిచయం కూడా ఉంది. ఆప్లేట్ వేయడం, చికెన్ వండడం వంటివి తెలుసు. మీరు నవ్వనంటే ఒక విషయం చెబుతా. వంట పాత్రలు కడగడం అంటే నాకు చాలా ఇష్టం.
ప్ర: చెన్నైలో మీకు నచ్చిన ప్రాంతం?
జ: సత్యం సినిమా థియేటర్. అదేమిటో తెలియదుగానీ ఆ థియేటర్‌లో సినిమా చూస్తే ఆ సుఖమే వేరు. అక్కడ పాప్‌కార్న్, కోల్డ్ కాఫీ బాగుంటాయి. సినిమా టికెట్ బుక్ చేసినప్పుడే పాప్‌కార్న్‌తో కలిపే బుక్ చేసుకుంటాను. ఆ తరువాత శాంథోమ్ చర్చ్‌కు తరచూ వెళుతుంటాను. నా మనసుకు దగ్గరైన ప్రాంతం అది.
ప్ర: ఈ తరం హీరోయిన్లు గాయనీగానూ అవతారమెత్తుతున్నారు.మీకు అలాంటి కోరిక?
జ: నాకు అలాంటి ఆశ లేదు. ఆ అర్హతా ఉందనుకోను. ఇప్పుడు అంతా ఆటోట్యూనేగా మీరు ఈజీగా పాడవచ్చుగా అని కొందరు అడిగారు. అయితే తెలియని విషయాన్ని నేనెప్పుడూ చేయను.
ప్ర: మీరు తరచూ కూని రాగాలు తీసే పాట?
జ: ఇటీవల నయనతార నటించిన చిత్రంలోని నాకు ఎప్పుడో పెళ్లి వయసు వచ్చిందే (ఎనక్కు ఎప్పో కల్యాణ వయసు వందుటుచ్చుడీ) పాటను తరచూ హమ్ చేస్తుంటాను.
ప్ర: సరే మీ పెళ్లెప్పుడూ?
జ: ఆహాహా.. ఇప్పట్లో కచ్చితంగా ఉండదు. మరో ఏడెనిమిదేళ్ల తరువాతే. అదీ ప్రేమ పెళ్లే చేసుకుంటా.
Comments
Please login to add a commentAdd a comment