బన్నీ ఒప్పుకుంటాడా..?
ఇటీవల కాలంలో చిన్న సినిమాగా విడుదలై భారీ విజయం సాదించిన కామెడీ ఎంటర్టైనర్ 'భలే భలే మొగాడివోయ్'. నాని, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ ఓవర్సీన్ లో కూడా భారీ వసూళ్లను రాబడుతుంది. ముఖ్యంగా వరుస ఫ్లాప్లతో ఇబ్బందుల్లో ఉన్న నాని కెరీర్కు మంచి కిక్ ఇచ్చింది ఈ మూవీ.
నాని కెరీర్కు మాత్రమే కాదు, దర్శకుడు మారుతికి కూడా ఈ సినిమా చాలా ప్లస్ అయ్యింది. ఇప్పటి వరకు అడల్ట్ కామెడీలు మాత్రమే చేస్తాడనే అపవాదు ఉన్న మారుతి ఈ సినిమాతో ఆ పేరు చెరిపేసుకున్నాడు. గతంలో స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలతో వర్క్ చేయని మారుతి నానితో ఆ కోరిక కూడా తీర్చేసుకున్నాడు.
భలే భలే మొగాడివోయ్ మూవీ ఇచ్చిన సక్సెస్తో ఇప్పుడు స్టార్ హీరోల మీద దృష్టిపెడుతున్నాడు మారుతి. తనకు పెద్దగా పరిచయం లేని హీరోలతో సినిమా చేసే కన్నా తన హోం బ్యానర్ లాంటి గీతా ఆర్ట్స్లోనే అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడట. ఇప్పటి వరకు పెద్ద హీరోలను, భారీ బడ్జెట్ సినిమాలను డీల్ చేసిన అనుభవం లేని మారుతితో సినిమా అంటే బన్నీ డేట్స్ ఇస్తాడో లేదో చూడాలి.