
బ్లాక్‌పాంథర్ పోస్టర్
మార్వెల్ కామిక్స్ తవ్వుతూ పోతే ఎక్కడ తేలతామో ఎవ్వరికీ తెలీదు. అంతటి చరిత్ర ఉంది మార్వెల్ కామిక్స్‌కు. ఇందులో స్టాన్లీ సృష్టించిన బ్లాక్‌పాంథర్ పాత్ర 1966లో మొదటిసారి కామిక్స్‌లో ప్రచురితమైంది. ఆ తర్వాత అప్పట్నుంచి ఎన్ని సూపర్‌హీరో క్యారెక్టర్స్ సినిమాకెక్కినా, బ్లాక్‌పాంథర్ మాత్రం 2016 వరకూ తెరమీదకు రాలేదు. 2016లో ‘కెప్టెన్ అమెరికా : సివిల్ వార్’లో కనిపించే వరకూ బ్లాక్‌పాంథర్ పుస్తకాలకే పరిమితమైంది. ఇక ‘కెప్టెన్ అమెరికా’తో సూపర్ అనిపించుకున్న ఈ సూపర్ హీరో ఇప్పుడు తాజాగా మళ్లీ మెప్పించేందుకు సిద్ధమైంది.
అదీ ఫుల్ లెంగ్త్ సూపర్ హీరో ఫిల్మ్ రూపంలో! ‘బ్లాక్‌పాంథర్’ పేరుతోనే తెరకెక్కిన ఈ కొత్త సూపర్ హీరో సినిమా ఫిబ్రవరి 16న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది. ఫస్ట్ వీకెండ్‌కే ఈ సినిమా 120 మిలియన్ డాలర్లు (సుమారు 760 కోట్ల రూపాయలు) వసూలు చేస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. ర్యాన్ కూగ్లర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చద్విక్ బోస్‌మన్ బ్లాక్‌పాంథర్ సూపర్ హీరోగా కనిపించనున్నాడు. 2016వరకూ బ్లాక్‌పాంథర్ స్క్రీన్ మీదకు ఎందుకు రాలేకపోయింది? అని ఎవరైనా అడిగితే, మార్వెల్ స్టూడియోస్ వంద సాకులు చెప్తోందట. ఏదైతేనేం ఇప్పటికైనా వచ్చిందని సూపర్‌హీరో ఫ్యాన్స్ మాత్రం ఆల్ హ్యాపీ!!