మేడ మీద అబ్బాయితో ట్రాక్ మార్చా
– ‘అల్లరి’ నరేశ్
‘‘ఎప్పట్నుంచో ‘నరేశ్ ట్రాక్ మారిస్తే బాగుంటుంది’ అని కోరుకుంటున్నా. నాకు తానెంత మంచి నటుడో తెలుసు. కామెడీ బాగా చేస్తాడని మనందరికీ తెలుసు. కామెడీ కంటే వేరే ఎమోషన్స్‌ను ఇంకా బాగా చేయగలడు. వాటినెవరూ చూపించలేదు. నరేశ్ కూడా ‘బాబాయ్... నా సిన్మాలు చూసేవాళ్లు, అభిమానులు కామెడీ ఆశిస్తారు’ అనేవాడు. ‘కామెడీ చేశావ్ కాబట్టి చూశారు.
మిగతా ఎమోషన్స్ చేస్తే నువ్వెంత మంచి నటుడివో అందరికీ అర్థమవుతుంద’ని చాలాసార్లు వాదించా. ఈ సిన్మా టీజర్ చూడగానే... నరేశ్ నటుడిగా వికసించే ప్రక్రియ మొదలైందనుకున్నా. భవిష్యత్తులో తనలోని నటుడి గురించి ప్రేక్షకులకు తెలుస్తుంది. అది ఈ సినిమాతో మొదలై, అతను మరిన్ని మంచి సినిమాలు చేయాలనుకుంటున్నా’’ అన్నారు హీరో నాని. ‘అల్లరి’ నరేశ్ హీరోగా జి. ప్రజీత్ దర్శకత్వంలో బొప్పన చంద్రశేఖర్ నిర్మించిన సినిమా ‘మేడ మీద అబ్బాయి’.
షాన్ రెహమాన్ స్వరకర్త. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ–రిలీజ్ వేడుకలో పాటల సీడీలను హీరోలు నిఖిల్, సందీప్ కిషన్ విడుదల చేశారు. నరేశ్ మాట్లాడుతూ –‘‘కొంచెం కొత్తగా, ట్రాక్ మార్చి సినిమాలు చేయమని నానితో సహా నా శ్రేయోభిలాషులు, అభిమానులు చెబుతున్నారు. ఈ సిన్మాతో ట్రాక్ మార్చా. నిర్మాతలు కథను నమ్మినప్పుడే విభిన్నమైన సినిమాలొస్తాయి. చంద్రశేఖర్‌గారు ‘కెవ్వు కేక’ నుంచి నాతో ఇలాంటి సినిమా చేయాలనుకుంటున్నారు. ఆయన నమ్మకమే ఈ సినిమా’’ అన్నారు. దర్శక–నటుడు అవసరాల, దర్శకులు ఇంద్రగంటి, దేవి ప్రసాద్ పాల్గొన్నారు.