మమ్ముట్టికి తల్లిగా మీనా?
మీనా వయసు నలభై లోపే. మమ్ముట్టికి అరవయ్యేళ్లు దాటి ఓ ఏడాది అయ్యింది. తనకన్నా వయసులో చాలా పెద్దవాడైన మమ్ముట్టికి తల్లిగా నటించడానికి మీనా అంగీకరించారని సమాచారం. వయసుకు తగ్గ పాత్రలు చేయడం సులువు కానీ ఇలా వయసుకు మించిన పాత్రలు మోయడం బరువే.
ఈ పాత్రను మీనా ఓ సవాల్‌గా తీసుకున్నారట. ‘బాల్యకాల సఖి’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో మమ్ముట్టి సరసన ఇషా తల్వార్ కథానాయికగా నటిస్తున్నారు. మలయాళంలో పలు చిత్రాల్లో నటించిన మీనాకు అక్కడ మంచి గుర్తింపు ఉంది. దాదాపు మూడు, నాలుగేళ్ల తర్వాత మలయాళంలో ఆమె నటిస్తున్న చిత్రం ఇది.
ఈ సినిమా కాకుండా మోహన్‌లాల్ భార్యగా ఓ చిత్రంలో నటిస్తున్నారు మీనా. ఇక, ఇటీవల విడుదలైన ‘శ్రీ జగద్గురు ఆదిశంకర’లో ఆమె ఓ పాత్ర చేసిన విషయం తెలిసిందే. విద్యాసాగర్‌ని పెళ్లి చేసుకుని, ఓ బిడ్డకు తల్లయిన తర్వాత మీనా రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు వరుసగా సినిమాలు అంగీకరిస్తున్నారు కాబట్టి కెరీర్‌ని సీరియస్‌గా తీసుకుంటున్నారని ఊహించవచ్చు.