బాక్సాఫీస్ దిమ్మతిరిగిపోయే ఫ్లాప్ సినిమాలు తీసిన దర్శకుడు మెహర్ రమేష్. కన్నడలో సక్సెస్‌లు సాధించినా తెలుగులో మాత్రం మెహర్ రమేష్ తెరకెక్కించిన సినిమాలన్ని బోల్తాపడ్డాయి. దీంతో చాలా కాలంగా ఈ దర్శకుడు సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అప్పుడప్పుడు కొన్ని ప్రకటనలకు దర్శకత్వం వహించినా పూర్తి స్థాయి సినిమా తెరకెక్కించి చాలా కాలమే అవుతుంది.
2013లో రిలీజ్ అయిన షాడో సినిమా తరువాత సినిమాలకు దూరమైన మెహర్ రమేష్ సినీ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు ఆ రిలేషన్స్ కారణంగానే ఓ క్రేజీ ప్రాజెక్ట్, ఈ దర్శకుడిగా చేతికి వచ్చినట్టుగా తెలుస్తోంది. నిర్మాణరంగం మీద దృష్టి పెట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు, సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ పనులన్ని మహేష్ భార్య, నమ్రత దగ్గరుండి చూసుకుంటున్నారు.
ఇప్పటికే అడివి శేష్ హీరోగా మేజర్ సినిమాను రూపొందిస్తున్న నమ్రత, త్వరలో ఓ వెబ్ సిరీస్‌ను నిర్మించనున్నారు. ఈ సిరీస్‌కు మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది. ముందుగా ఈ వెబ్ సిరీస్‌ను రాహుల్ సంక్రిత్యాన్ (టాక్సీవాలా ఫేం) దర్శకత్వంలో రూపొందించాలని భావించినా.. రాహుల్ తప్పుకోవటంతో మెహర్ రమేష్‌ను దర్శకుడిగా తీసుకున్నారు. మరి వెండితెర మీద సక్సెస్ కాలేకపోయిన ఈ దర్శకుడు, డిజిటల్‌లో అయినా విజయం సాధిస్తాడామో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment