లాగి లెంపకాయ కొట్టిన సింగర్
ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగే పాటల వేడుక వివాదానికి వేదికగా మారడమంటే ఇదే! ఆవేశాన్ని అదుపు చేసుకోకపోతే, ఆనక అనవసరమైన తలనొప్పులు తప్పవని ప్రముఖ పంజాబీ గాయకుడు, గీత రచయిత, కంపోజర్ మికా సింగ్‌కు ఇప్పుడు తెలిసొచ్చినట్లుంది. నాలుగు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన ఒక సంగీత విభావరిలో ప్రేక్షకులలో ఉన్న ఒక డాక్టర్‌ను లాగి లెంపకాయ కొట్టిన ఈ ప్రముఖ గాయకుడు ఇప్పుడు పోలీసు కేసును ఎదుర్కోవాల్సి వచ్చింది. ‘ఢింక చిక...’ (హిందీ చిత్రం - ‘రెడీ’), ‘చింతా తా చిత చితా...’ (హిందీ చిత్రం - ‘రౌడీ రాథోడ్’) లాంటి మాస్‌పాటలతో దేశాన్ని ఉర్రూతలూపిన మికా సింగ్ మాత్రం తాను అంతలా సహనం కోల్పోవడం వెనుక కారణం ఉందంటున్నారు.
తాగి వచ్చిన సదరు డాక్టర్ తాను ఎన్నిసార్లు చెప్పినా ఆ విభావరిని చూడడానికి వచ్చిన ఆడవారికీ, పిల్లలకూ జాగా ఇవ్వలేదనీ, పైగా చేతి మధ్యవేలును పైకి ఎత్తి, అసభ్యమైన సైగలు చేశారనీ ఆరోపిస్తున్నారు. ‘‘వేదిక మీదకు పిలిచి మరీ ‘మీ ఇంట్లో వాళ్ళ ముందు అలాగే అసభ్యమైన సైగలు చేస్తావా’ అని మందలించాను. తాగేసి ఉన్న అతను మళ్ళీ అలాగే సైగలు చేయడంతో ఒక లెంపకాయ ఇచ్చాను’’ అని మికా సింగ్ తన ప్రవర్తనను సమర్థించుకున్నారు.
తెలుగులో కూడా ‘బలుపు’ (పాపులర్ పాట ‘పాతికేళ్ళ చిన్నది...’), ‘అదుర్స్’ (‘పిల్లా నా వల్ల కాదు...’ పాట), ‘మిర్చి’ (‘యాహూ.. యాహూ...’ పాట) లాంటి పాటలతో ఆకట్టుకున్న ఈ గాయకుడు ఇప్పుడు పాట కన్నా తన ప్రవర్తనతో వార్తల్లోకి ఎక్కడం విచిత్రమే. చెంపదెబ్బ తిన్న డాక్టర్ మాత్రం మికా సింగ్ తనను పక్కకు తప్పుకొమ్మంటూ అసభ్యకరంగా చెప్పారనీ, బౌన్సర్ల ద్వారా తనను వేదిక మీదకు తెప్పించి, తన మాట వినలేదంటూ కొట్టారనీ ప్రత్యారోపణ చేస్తున్నారు. మొత్తానికి, ఢిల్లీలోని నేత్ర వైద్యుల సంఘం ఆనందం కోసం ఏర్పాటుచేసుకున్న విభావరి చివరకు ఆవేశకావేశాలకు వేదికైందన్న మాట.