‘అందం, తెలివితో పాటు శక్తివంతంగా ఉండడమూ అవసరం. ఈ సూత్రాన్ని అందరికీ తెలియజేయాలంటే ఆ విధంగా నడుచుకోని చూపించాలి. మహిళలు మల్టీ టాలెంటెడ్. ఏ రంగంలోనైనా విజయం సాధించగలరు. ఈ రెండింటికీ నేనే ఉదాహరణ’ అని చెప్పారు ప్రముఖ మోడల్, నటి, కరాటే క్రీడాకారిణి సంధ్యాశెట్టి. మిస్ ఇండియా ఫైనలిస్ట్‌గా ఫ్యాషన్ రంగంలోకి అడుగేసి, 2003లో ఎంఎఫ్ హుస్సేన్ మీనాక్షి (హిందీ) సినిమాలో నటించి, 2015లో కరాటే చాంపియన్‌గా దేశానికి బంగారు పతకం సాధించి పెట్టింది. ఇటీవల నగరానికి వచ్చిన ఈ మల్టీ టాలెంటెడ్ ఉమన్ ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలివి...
నేను ముంబైలో పుట్టి పెరిగాను. నేను అడుగేసిన అన్ని రంగాల్లో మంచి లైఫ్. అయితే శక్తివంతమైన మహిళగా నిరూపించుకోవాలనే తపన ఉండేది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించినా ఎన్‌సీసీ ఆర్మీ వింగ్‌లో కొనసాగాను. నాకు ఇద్దరు సోదరులు, సోదరి. వాళ్లలా నేనూ బలంగా ఉండాలని చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని. అది 2015లో కామన్‌వెల్త్ క్రీడల్లో కరాటేలో బంగారు పతకం సాధించినప్పుడు నిజమైంది.
ఏదైనా సాధ్యమే...
మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరు. మోడల్‌గా, క్రీడాకారిణిగా రాణించడం కష్టమేం కాదు. ఇందుకు మా అమ్మే నాకు స్ఫూర్తి. ప్రతి మహిళ అందంగా, ఫిట్‌గా ఉండడం సాధ్యమే. ఒక స్త్రీ కూతురిగా, భార్యగా, తల్లిగా అనేక బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఇన్ని పనులు చేయగలిగే వారికి టైమ్ మేనేజ్‌మెంట్ బాగా తెలుస్తుంది.
ఆ తృప్తే వేరు...
మోడలింగ్, యాక్టింగ్, స్పోర్ట్స్ దేనికదే ప్రత్యేకం. అయితే నేను చిన్నప్పటి నుంచి క్రీడాకారిణిని. దేశం కోసం ఆడినప్పుడు కలిగే సంతృప్తే వేరు. తల్లిదండ్రులు పిల్లల్ని ఆటల్లో ప్రోత్సహించాలి. క్రీడాకారులు శారీరకంగా, మానసికంగా శక్తివంతంగా ఉంటారు.
క్లీన్ అండ్ ఫ్రెండ్లీ
హైదరాబాద్‌కి చాలాసార్లు వచ్చాను. ఈ సిటీ ముంబై కంటే క్లీన్‌గా ఉంటుంది. ఇక్కడి వాళ్లు చాలా ఫ్రెండ్లీ. ఇక బిర్యానీ యమ్మీ. సిటీ క్రీడాకారిణి సింధూ జర్నీని గమనిస్తున్నాను. ఆమె స్త్రీ శక్తికి ప్రతీకగా నిలుస్తోంది. దేశం గర్వించదగ్గ ఆడబిడ్డ. అందరు తల్లిదండ్రులు అమ్మాయిలను క్రీడల్లో ప్రోత్సహించాలి.
నో ఫియర్ క్యాంపెయిన్...
ఈ క్యాంపెయిన్ ద్వారా మహిళలకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తుంటాను. మన దేశంలో స్త్రీలపై జరుగుతున్న దాడులకు ఇతరులను నిందిచడం కంటే మనమే శక్తివంతంగా మారాలి. మహిళలు శారీరకంగా బలంగా తయారు కావాలి. ఇందుకు సెల్ఫ్ డిఫెన్స్, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి. అలాగే తల్లులు తమ కొడుకులకు స్త్రీలను గౌరవించాలని చిన్నప్పటి నుంచే చెప్పాలి. రెండు విధాలుగా స్త్రీలే మార్పు తీసుకురాగలరు.
చాలెంజెస్ తప్పవు..
కరాటే, మోడలింగ్ రెండు వేర్వేరు కావడంతో చాలెంజెస్ తప్పవు. కరాటేలో దెబ్బలు తగిలి కాలు ఫ్రాక్చర్ అయింది. రెండు రోజుల్లో షూటింగ్ ఉంది. ఇలాంటి చాలెంజెస్‌ని ఎదుర్కొని సాగడమే జీవితం. 2016లో నేషనల్ చాంపియన్‌షిప్, తర్వాత ఏసియన్ కరాటే ఫెడరేషన్‌లో బంగారు పతకం సాధించాను. దర్శకుడు ప్రియదర్శన్‌తో పనిచేయాలనే కోరిక తీరింది. ఆయన తమిళ చిత్రం టైటిల్‌సాంగ్‌లో ఉన్నాను. ఇది 2018 జనవరిలో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment