మహేశ్ సినిమా చేద్దామన్నారు | ms raju interview | Sakshi
Sakshi News home page

మహేశ్ సినిమా చేద్దామన్నారు

Published Tue, Oct 27 2015 10:30 PM | Last Updated on Sun, Sep 3 2017 11:34 AM

మహేశ్ సినిమా చేద్దామన్నారు

మహేశ్ సినిమా చేద్దామన్నారు

‘‘నిర్మాతగా పలు జయాపజయాలు చూశాను. విజయాలకు పొంగిపోలేదు.
అపజయాలకు కుంగిపోలేదు’’ అని నిర్మాత యమ్మెస్ రాజు అన్నారు.
ఈ దసరాతో ఆయన నిర్మాతగా ప్రవేశించి పాతికేళ్లయ్యింది.
ఈ సందర్భంగా పాత్రికేయులతో తన కెరీర్, ఇతర విశేషాల గురించి ఎమ్మెస్ రాజు పంచుకున్న విశేషాలు...
ఆయన మాటల్లోనే...

తొలి సినిమా ‘శత్రువు’ను ప్యాషన్‌తో నిర్మించాను. ఆ తర్వాత నిర్మించిన ‘పోలీస్ లాకప్’ కూడా విజయం సాధించింది. మూడో సినిమా ‘స్ట్రీట్ ఫైటర్’ స్ట్రీట్‌కి తెచ్చేసింది. కానీ, అధైర్యపడలేదు.

ఆ తర్వాత తీసిన ‘దేవి’ విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. ఓ టెక్నికల్ వండర్ చూపించాలనే ఆకాంక్షతో ‘దేవీపుత్రుడు’ తీశాను. ఆ చిత్రం నిరాశపరిచిన నేపథ్యంలో, జీవితంలో మళ్లీ సక్సెస్ వస్తుందా? అనుకున్నాను. నేను స్టోరీ, స్క్రీన్‌ప్లే తయారు చేసుకుని ‘మనసంతా నువ్వే’ నిర్మించాను. ఆ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘నీ స్నేహం’ కూడా ఫర్వాలేదనిపించుకుంది.
 
వరుసగా మూడు సంచలన విజయాలు
‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’... ఇలా వరుసగా మూడు బ్లాక్ బస్టర్స్ తర్వాత తీసిన ‘పౌర్ణమి’ నాకు అమావాస్య అయ్యింది (నవ్వుతూ). ఓ పాజిటివ్ మైండ్‌తో ‘ఆట’ తీస్తే, సక్సెస్ అయ్యింది. అప్పుడే కన్నడ చిత్రం ‘ముంగారు మళె’ని ‘వాన’గా నా దర్శకత్వంలోనే రీమేక్ చేశాను. క్లయిమ్యాక్స్ వల్లే కన్నడ చిత్రం ఆడిందనీ, మార్చొద్దనీ వేరేవాళ్లు అంటే, అలానే ఉంచేశాను. క్లయిమ్యాక్స్ వల్లే ఆ సినిమా పోయింది. అప్పుడనుకున్నా.. మన మనసుకు ఏది అనిపిస్తే అది చేయాలని.
 
ఈ నాలుగేళ్లు విలువైనవి
‘మస్కా’ తర్వాత మా బేనర్లో మళ్లీ సినిమాలు తీయలేదు. ఈ నాలుగేళ్ల విరామాన్ని మా అబ్బాయి (సుమంత్ అశ్విన్) కెరీర్‌పై దృష్టి పెట్టడానికి వినియోగించాను. తెలుగు, హిందీ.. ఇలా భాషాభేదం లేకుండా అన్ని సినిమాలూ చూసి, అప్‌డేట్ అవుతుంటాను. ఆ అవగాహనతో మా అబ్బాయి ఎలాంటి సినిమాలు చేస్తే బాగుంటుందో ప్లాన్ చేశాను. ఇప్పటివరకూ తను ఆరు సినిమాల్లో హీరోగా నటిస్తే, నాలుగు సక్సెస్ అయ్యాయి. ఆ విధంగా తన కోసం కేటాయించిన ఈ నాలుగేళ్లు నాకు విలువైనవిగా అనిపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన సుమంత్ అశ్విన్ ‘కొలంబస్’ సక్సెస్ బాటలో సాగడం ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి నేనే కథ-స్క్రీన్‌ప్లే ఇచ్చాను. ఈ చిత్రవిజయానికి స్క్రీన్‌ప్లే ఓ కారణం అని అందరూ అంటున్నారు.
 
కమల్, ఆమిర్ దారిలో మా అబ్బాయి...
కమలహాసన్, ఆమిర్‌ఖాన్, అజిత్ వంటి హీరోలను తీసుకుంటే.. వాళ్లు ముందు సాఫ్ట్ రోల్స్ చేసి, ఆ తర్వాత పవర్‌ఫుల్ రోల్స్ చేశారు. తిరుగు లేని మాస్ హీరోలనిపించుకున్నారు. మా అబ్బాయి కూడా వీళ్ల బాటలో ఇప్పుడు తన వయసుకి తగ్గట్టుగా ప్రేమకథా చిత్రాలు, లవ్‌స్టోరీ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ చేస్తూ గ్రాఫ్ పెంచుకుంటాడు. భవిష్యత్తులో ఈ ముగ్గురి హీరోల్లా స్థిరపడతాడు.
 
మహేశ్, ప్రభాస్ వెరీ సపోర్టివ్
నా సంస్థలో మహేశ్‌బాబు చేసిన ‘ఒక్కడు’, ప్రభాస్ చేసిన ‘వర్షం’ సెన్సేషనల్ హిట్టయ్యాయి. ఇప్పుడు వాళ్లిద్దరూ అగ్రహీరోలుగా ఎదగడం చాలా ఆనందంగా ఉంది. మహేశ్, ప్రభాస్ నాకెప్పుడూ సపోర్టివ్‌గానే ఉంటారు. ఈ మధ్య మహేశ్‌ని కలిసినప్పుడు ‘ప్లాన్ చేయండి... సినిమా చేద్దాం’ అనడం ఆనందం అనిపించింది. వచ్చే ఏడాది మా సుమంత్ ఆర్ట్స్ బేనర్లో ఓ స్టార్ హీరోతో, మా అబ్బాయితో ఓ సినిమా నిర్మిస్తా. చిన్న క్లూ ఏమిటంటే ఆ స్టార్ హీరో మా బేనర్లో ఒక సినిమా చేశాడు. వివరాలు మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement