నటుడిపై లైంగిక వేధింపుల కేసు
ముంబై: టీవీ నటుడు పార్థ్ సమతాన్ చిక్కుల్లో పడ్డాడు. మోడల్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు అతడు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అతడిపై బాంగర్ నగర్ పోలీసులు సెక్షన్ 354ఏ కింద కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 20న జరిగిన ఈ ఘటనపై గత నెలలోనే పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సమన్లు జారీ చేయడంతో శనివారం పోలీసుల ఎదుట హాజరయ్యాడు.
తనపై బాధితురాలు చేసిన ఆరోపణలను పార్థ్ తోసిపుచ్చాడు. అవన్ని తప్పుడు, నిరాధార ఆరోపణలని పేర్కొన్నాడు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి తాను వాంగ్మూలం ఇచ్చినట్టు తెలిపాడు. ఇది స్నేహితుల మధ్య తలెత్తిన వివాదమని, ఏడాదిన్నర ఆమె ఫిర్యాదు చేసిందని వెల్లడించారు. నిర్మాత వికాస్ గుప్తాతో కలిసి బాధితురాలు ఫిర్యాదు చేయడం పట్ల అతడు అనుమానం వ్యక్తం చేశాడు. ఇదంతా వికాస్ గుప్తా కుట్ర అని ఆరోపించాడు.
ఎటువంటి ఆధారాలు లేకుండా తనపై ఫిర్యాదు చేశారని, బాధితురాలు తర్వాత తనకు ఫోన్ చేసి ఫిర్యాదు ఉపసంహరించుకుంటానని చెప్పినట్టు వెల్లడించాడు. కేసు వెనక్కు తీసుకునేందుకు పోలీసులు ఒప్పుకోవడం లేదని వాపోయాడు. తన ఫోన్ లోని కాల్ రికార్డింగ్స్, వాట్సప్ మెసేజ్ లను పోలీసులకు అందజేసినట్టు తెలిపాడు. త్వరలోనే కేసు నుంచి బయటపడతానన్న నమ్మకాన్ని పార్థ్ వ్యక్తం చేశాడు. వికాస్ గుప్తాపై వేధింపులు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో పార్థ్ విమర్శపాలయ్యాడు.