వివాదాలపై తొలిసారి నోరు విప్పిన అనిరుధ్
ఐఫా (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్) ఉత్సవం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. రెండు రోజులు జరుగనున్న ఈ వేడుకలో మొదటిరోజు ఆదివారం తమిళ, మలయాళ కళాకారులకు అవార్డులను అందజేశారు. ఈ వేడుకలో ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్, సమంత జంటగా నటించిన 'కత్తి' సినిమాకి అందించిన సంగీతానికిగాను ఉత్తమ సంగీత దర్శకుడిగా అనిరుధ్ ఎంపికయ్యారు.
డిసెంబర్ నెలలో 'బీప్' సాంగ్ పై వివాదం చెలరేగినప్పటి నుంచి మీడియాకు దూరంగా ఉన్న యువ సంగీత దర్శకుడు అనిరుధ్ తొలిసారి ఐఫా వేదికపై నోరు విప్పాడు. ఉత్తమ సంగీత దర్శకుడిగా ఐఫా పురస్కారాన్ని అందుకుంటూ అనిరుధ్.. 'సాధారణంగా నేను స్టేజ్ మీద మాట్లాడను, కానీ ఈరోజు మాట్లాడతాను. కొలవెరి ఢీ పాట సమయం నుంచే నాకు ఇబ్బందులు మొదలయ్యాయి. కత్తి మూవీ రిలీజ్ టైంలో కూడా చాలా వివాదాలను ఎదుర్కొన్నాను. చివరిగా నేను నేర్చుకున్నదేంటంటే.. వివాదాలను అస్సలు లెక్క చేయకూడదు, మనం పని మీద మాత్రమే శ్రద్ధ పెట్టాలి. గత నాలుగేళ్లుగా నన్నెంతో ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు, ఈ నాలుగేళ్లలో 11 సినిమాలకు సంగీతం అందించాను. ఒక్కటి మాత్రం నేను కచ్చితంగా చెప్పగలను.. బాధ లేకుండా విజయం ఉండదు' అంటూ ముగించాడు ఈ యువ తరంగం.
మహిళలను కించపరిచే పదజాలంతో పాడిన 'బీప్' సాంగ్ వివాదంలో తమిళ హీరో శింబు, సంగీత దర్శకుడు అనిరుధ్ లపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని వారాల తర్వాత అనిరుధ్ మాట్లాడటం సినీ సర్కిల్స్ లో ఆసక్తి కలిగించింది.