
ప్రయోగాలకు డాడీ భయపడరు..
ముంబై: 'డాడీ ఎవ్వరికీ భయపడరు. ప్రయోగాలు చేయడానికి ఆయన అస్సలు వెనక్కి తగ్గరు. ఏదైనా సరికొత్తగా ట్రై చేయడమంటే డాడీకి చాలా ఇష్టం. పప్పా చాలా నిజాయితీగా ఉండే వ్యక్తి' అంటూ తన తండ్రిని తలుచుకొని మురిసిపోతున్నది మరెవ్వరో కాదు.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ హీరోయిన్గా దూసుకుపోతున్న శ్రుతిహాసన్.
ఆమె నటించిన హిందీ చిత్రం 'గబ్బర్ ఈజ్ బ్యాక్' (మే 1) విడుదలైన సందర్భంగా మీడియాతో ముచ్చటించిన ఆమె... తల్లిదండ్రులు సారిక, కమల్ హసన్పై తన అభిమానాన్ని చాటుకుంది. అమ్మ సారిక చాలా దృఢంగా, స్వాతంత్ర్యంగా ఉంటారనీ... నాన్నకు సంబంధించినంతవరకు ఒక నటుడిగా ఆయన ఎవ్వరికీ భయపడరని తెలిపింది.
అమ్మ స్పాంటేనియస్గా నటిస్తే.. నాన్న కమల్ చాలా సహజంగా నటిస్తారని చెప్పుకొచ్చింది. పనిలో పనిగా తన సోదరి, షమితాబ్ సినిమా హీరోయిన్ అక్షర హాసన్పై పొగడ్తలు గుప్పించింది శ్రుతి. ఆమె తన సోదరి కావడం గర్వంగా ఉందని మురిసిపోయింది.
కాగా క్రిష్ దర్శకత్వంలో అక్షయ కుమార్, శ్రుతిహాసన్ హీరో హీరోయిన్లుగా నటించిన 'గబ్బర్ ఈజ్ బ్యాక్' సినిమాలో కరీనా కపూర్ ప్రత్యేక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.