జీవిత చరిత్రకు ‘నో’
ఓ విజయవంతమైన సినిమాలో ఉండే మలుపులు, మెరుపులు, మసాలాలు, ఇంకా ఎన్నెన్నో విలాపాలూ విలాసాలూ వివాదాలూ కమల్‌హాసన్ జీవితంలో కూడా ఉంటాయి. అందుకే కమల్‌హాసన్ జీవిత విశేషాలతో ఓ పుస్తకం వస్తే అది కచ్చితంగా హాట్ కేక్ అవుతుంది. ఎందుకంటే, ఆయన వృత్తిజీవితం, వ్యక్తిగత జీవితం.. రెండూ పసందుగానే ఉంటాయి. పైగా, కమల్‌తో కొన్నేళ్ల పాటు జీవితాన్ని పంచుకున్న ఆయన మాజీ భార్య సారిక స్వయంగా తన మాజీ భర్త జీవిత చరిత్ర రాస్తే... ఎంత క్రేజ్ ఉంటుందో తెలిసిందే.
ఆ పుస్తకాన్ని ప్రచు రించడానికి బోలెడంతమంది పోటీపడతారు. ప్రస్తుతం కమల్ జీవిత చరిత్ర రాసే పని మీద ఉన్నారట సారిక. ఇది కమల్‌కి ఏమాత్రం రుచించడంలేదట. దీని గురించి తెలిసిన కమల్.. ‘‘నా లైఫ్ కాంట్రవర్షియల్. నా అంగీకారం లేకుండా రాసే రాతలు నా పిల్లలను బాధించకూడదనుకుంటున్నాను’’ అని తన ఫ్రెండ్ దగ్గర పేర్కొన్నారట. ఏదేమైనా తన జీవిత చరిత్రను సారిక రాయడం కమల్‌కి ఇష్టం లేదని అర్థమవుతోంది. ఈ మాటలు ఆ నోటా ఈ నోటా సారికకు చేరే ఉంటాయి. మరి... కమల్ జీవిత చరిత్ర రాయాలనే తన నిర్ణయాన్ని సారిక మార్చుకుంటారో లేక అన్ని విషయాలనూ బయటపెడతారో కాలమే జవాబు చెప్పాలి.