నా సోదరి సినిమాలు చేయదు: హీరో
ముంబయి: భాషతో సంబంధం లేకుండా ప్రతి సినీ ఇండస్ట్రీలోనూ వారసుల హవా కొనసాగుతుంటోంది. ఇంకా చెప్పాలంటే వారసురాళ్లు కూడా రంగుల ప్రపంచంలో కాలుమోపి నిరూపించుకున్న సందర్భాలున్నాయి. అయితే తన సోదరి అన్షుల కపూర్ మాత్రం సినిమాల్లో నటించదని బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ స్పష్టం చేశాడు. అయితే ఇందులో కుటుంబసభ్యుల జోక్యం ఎంతమాత్రం లేదన్నాడు. అన్షులకి సినిమాల్లో నటించడం ఇష్టం లేకపోవడమే ప్రధాన కారణమని అర్జున్ తెలిపాడు.
హీరో అర్జున్ కపూర్ నటించిన ముబారకన్ మూవీ ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు వసూలు చేస్తోంది. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘నా సోదరి అన్షులకి ఇంటస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం ఇష్టం లేదు. ఆ విషయం నాకు ఎలాగూ మేలు చేస్తుందని భావిస్తాను. తన నా సినిమాలకు ప్రేక్షకురాలు మాత్రమే కాదు, విమర్శకురాలిగా తన అభిప్రాయాలను నేరుగా నాతో పంచుకుంటుంది. దీంతో ప్రేక్షకులు నా నుంచి ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారో సులువుగా అర్థం చేసుకుంటాను. తను సాధారణ అమ్మాయిల్లాగే అన్ లైన్లో మూవీ టికెట్లు బుక్ చేసుకుని థియేటర్‌కు వెళ్లి వాటి కోసం క్యూలైన్లో నిల్చుంటుందని’ అర్జున్ వివరించాడు.
నిర్మాత, తండ్రి బోని కపూర్‌తో మూవీ ఎప్పుడు చేస్తారన్న ప్రశ్నపై స్పందిస్తూ.. మేమిద్దరం ఇప్పటివరకూ ఒక్కసారి కూడా కూర్చుని సినిమాపై చర్చించలేదు. అయితే భవిష్యత్తులో ఏదైనా మంచి కథ మా ఇద్దరికి నచ్చితే.. కచ్చితంగా సినిమా చేస్తాం. ఇప్పుడు ఈ వార్త చూసి మా నాన్న బోని కపూర్ దీనిపై ఆలోచిస్తారని నవ్వేశాడు నటుడు బోని కపూర్.