దసరా బుల్లోడా? | Nagargunas Son Akhil Akkineni Begins Shooting | Sakshi
Sakshi News home page

దసరా బుల్లోడా?

Published Wed, May 27 2015 11:46 PM | Last Updated on Sun, Sep 3 2017 2:47 AM

దసరా బుల్లోడా?

దసరా బుల్లోడా?

విదేశాల్లో షూటింగ్... అందులోనూ ఒకటీ రెండు రోజులు కాదు... ఏకంగా నెల రోజులు. హీరోగా తొలి చిత్రం చేస్తున్న అఖిల్‌కు మొదటి సినిమా షూటింగే ఇప్పుడు మధురానుభూతిగా మారింది. స్పెయిన్‌లో ఈ కొత్త చిత్రం షూటింగ్ ముగించుకొని, ఈ యువ హీరో ఇప్పుడు ఇంటి ముఖం పట్టారు. అఖిల్‌కు సన్నిహితుడైన హీరో నితిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాస్ చిత్రాలను తీయడంలో సిద్ధహస్తుడైన వి.వి. వినాయక్ దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.
 
 తొలి సినిమాకే విదేశాల్లో షూటింగ్‌లో పాల్గొనడం సహజంగానే అఖిల్‌కు ఆనందాన్నిస్తోంది. స్పెయిన్‌లో ఏకధాటిగా జరిగిన ఈ షూటింగ్‌లో కొన్ని కీలక సన్నివేశాలు, ఫైట్లు, పాటలు చిత్రీకరించారు. విశేషం ఏమిటంటే, అక్కడ షూటింగ్ జరుగుతుండగా, నాగ్, అమల కలసి షూటింగ్ స్పాట్‌కు వెళ్ళారు.
 
 ‘‘మా అమ్మా నాన్న కలసి స్పెయిన్‌లో మా షూటింగ్ సెట్స్‌కు రావడం నాకెంతో గర్వంగా అనిపించింది’’ అని అఖిల్ చెప్పారు కూడా! శేఖర్ మాస్టర్‌తో డ్యాన్సులు, స్పెయిన్‌లోని అద్భుతమైన మష్‌రూమ్ బిల్డింగ్ దగ్గర స్టంట్ మాస్టర్ రవివర్మతో యాక్షన్ సీన్లు, హీరోయిన్ సాయేషా సైగల్‌తో పాటలు - ఇవన్నీ అఖిల్‌కు కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చాయి. వేగంగా షూటింగ్ చేసే వినాయక్ నుంచి ఈ కొత్త హీరో చాలానే నేర్చుకున్నట్లున్నారు.
 
 హీరో నితిన్ కూడా స్పెయిన్‌కు వచ్చి వెళ్ళడం,షూటింగ్‌లో ఉండగానే అమితాబ్ - దీపికా పదుకొనేల ‘పికూ’ చిత్రం బాగుందని తెలిసి ఆ సినిమా ఆడుతున్న హాలు కోసం వెతుక్కోవడం - ఇవన్నీ అఖిల్‌కు తీపి గుర్తులే! అన్నట్లు, ఈ సినిమా టైటిల్ ‘మిస్సైల్’ అంటూ మీడియాలో ప్రచారమవుతోంది. అయితే, ఆ వార్తల్లో నిజం లేదని సాక్షాత్తూ నితిన్ ట్వీట్ చేశారు. ఇంకా టైటిల్ ఏదీ నిర్ణయించలేదన్నారు. టైటిల్ మాటెలా ఉన్నా, శరవేగపు షూటింగ్‌లో మిస్సైల్‌ను తలపిస్తున్న ఈ చిత్రం దసరా పండుగకల్లా ప్రేక్షకుల్ని పలకరించే అవకాశం ఉందట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement