
అసలు లైంగిక వేధింపులు అంటే ఏంటి? ఆ సమయంలో అక్కడ నాతో పాటు 50 నుంచి 100 మంది వరకు ఉన్నారు.
బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా తనపై చేస్తున్న ఆరోపణలపై నానా పటేకర్ ఎట్టకేలకు స్పందించాడు. గురువారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ..‘ అసలు లైంగిక వేధింపులు అంటే ఏంటి? నేను అసభ్యంగా ప్రవర్తించానని ఆమె చెబుతున్న సమయంలో అక్కడ నాతో పాటు 50 నుంచి 100 మంది వరకు ఉన్నారు. ఈ ఆరోపణలను చట్టపరంగానే ఎదుర్కొంటాను. చూడండి ఏం జరుగుతుందో. అసలు మీడియాతో మాట్లాడుతూ సమయం వృథా చేస్తున్నా. ఇప్పుడు కూడా మీకు మీరే ఏదో ఊహించేసుకుని నచ్చింది రాసేస్తుంటారు’ అంటూ నానా పటేకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనుశ్రీ ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని కొట్టిపారేశాడు.
తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు నానా పటేకర్ సామాజిక సేవ చేస్తున్నట్టుగా మంచి ముసుగు వేసుకుంటాడన్న తనుశ్రీ ఆరోపణలకు సమాధానంగా... ‘ఎవరికి నచ్చిన తీరుగా వారు మాట్లాడుకోవచ్చు. నా పనేంటో నేను చేసుకుంటూ వెళ్తా. కరువుతో అల్లాడుతున్నమహారాష్ట్ర రైతులకు చేతనైన సాయం చేస్తున్నా. నాకెంతో సంతోషాన్నిచ్చే విషయం ఇది’ అంటూ పటేకర్ వ్యాఖ్యానించాడు.
కాగా జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న ప్రముఖ నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడని తనుశ్రీ దత్తా ఆరోపించారు. 2009లో ‘హార్న్ ఒకే ప్లీజ్’ సినిమా చిత్రీకరణ సమయంలో నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె పేర్కొన్నారు. ‘నానా పటేకర్ గొప్ప నటుడు కావొచ్చు. కానీ అతడు ఆడవారి పట్ల చాలా అమర్యాదగా ప్రవర్తిస్తాడు. అతను నటీమణులను కొడతాడు.. లైంగికంగా వేధిస్తాడు. ఈ విషయాల గురించి ఇండస్ట్రీలో అందరికి తెలుసు. కానీ ఎవ్వరూ మాట్లాడరు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.