
మాటల్లో చెప్పలేని ఆనందం
2014వ సంవత్సరానికిగాను రఘుపతి వెంకయ్య అవార్డుకు నన్ను ఎంపిక చేశారు. అంత గొప్ప అవార్డు రావటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. రఘుపతి వెంకయ్య పేరు మీద అవార్డు నెలకొల్పడమే చాలా గొప్ప విషయం. ఆ అవార్డు నన్ను వరించడం మాటల్లో చెప్పలేని అనుభూతి. అంతే కాకుండా 2015వ సంవత్సరానికి ప్రకటించిన అవార్డుల్లో ‘బాహుబలి’ తన సత్తా ఏంటో నిరూపించుకున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది.
– నటుడు కృష్ణంరాజు
ఈ అవార్డును గుండెల్లో దాచుకుంటా
దక్షిణ భారతదేశంలో మూడు కేలండర్‌లు చూసిన ఏకైక చిత్రం ‘లెజెండ్’. బాలకృష్ణగారి కెరీర్‌లోనే ఇదొక మైలురాయి. ‘లెజెండ్’కు వచ్చిన మొత్తం తొమ్మిది అవార్డులు సినిమాకి దక్కిన గౌరవంగా భావిస్తున్నా. నా కెరీర్‌లోనే మొదటిసారి అందుకుంటున్న నంది ఇది. ఈ అవార్డును గుండెల్లో దాచుకుంటా. నాకు మాత్రమే కాకుండా ఉత్తమ హీరోగా అవార్డు అందుకోనున్న బాలకృష్ణగారికి, ఉత్తమ విలన్‌గా సెలక్ట్ అయిన జగపతిబాబుగారికి, మా సినిమాకి, మాతో పాటు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
– దర్శకుడు బోయపాటి శ్రీను
వెరీ స్పెషల్
‘‘ఉత్తమ చిత్రం ‘పెళ్ళిచూపులు’కి, ఉత్తమ నటిగా నాకు ప్రతిష్టాత్మక నంది అవార్డులు రావడం సో హ్యాపీ అండ్ స్పెషల్. అందులోనూ నా తొలి నంది కావడంతో ఇంకా స్పెషల్. ‘పెళ్ళిచూపులు’ సినిమా, అందులో నేను చేసిన ‘చిత్ర’ పాత్ర ఎప్పుడూ నా మనసుకు దగ్గరగానే ఉంటాయి. నాకు మంచి పాత్ర ఇచ్చిన మా దర్శకుడు తరుణ్ భాస్కర్‌కి, ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. సినిమా విడుదలైన ఏడాది తర్వాత కూడా సక్సెస్ కంటిన్యూ అవుతుంటే గొప్పగా అనిపిస్తోంది.
– నటి రితూ వర్మ
అవార్డు వస్తుందని నమ్మాను
డైరెక్టర్‌గా నా ఫస్ట్ మూవీకే అవార్డు రావడం వెరీ హ్యాపీ. నాగార్జునగారు ‘వెరీ హ్యాపీ ఫర్ యు’ అని అభినందించారు. నిజానికి నందికి అప్లై చేస్తున్నప్పుడే అవార్డు వస్తుందని నమ్మాను. ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు నంది జ్యూరీ కూడా గుర్తించింది. బెస్ట్ డెబ్యూ డైరెక్టర్‌గానే కాకుండా మా సినిమాకి ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్‌కి కూడా అవార్డు వచ్చింది. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించింది.
– దర్శకుడు కల్యాణ్ కృష్ణ
రచ్చ గెలిచి.. ఇంట గెలిచా
ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ముందు నేషనల్ అవార్డ్ రూపంలో రచ్చ గెలిచాను. ఇంట గెలుస్తానో లేదో వేచి చూశాను. ‘శతమానం భవతి’ లాంటి మంచి సినిమా తీసినందుకు జనాలు అందలం ఎక్కించారు. జనాలు గుర్తించారని ఆనందపడ్డాను. ఇప్పుడు జనాలు ఎన్నుకున్న ప్రభుత్వాలు గుర్తించాయి. తెలుగు వారి సంప్రదాయాలు, అనుబంధాలను గుర్తు చేసిన సినిమాకు రివార్డులతో పాటు అవార్డులు రావటం ఆనందంగా ఉంది. నిర్మాత ‘దిల్’ రాజుగారికి, శర్వానంద్, ప్రకాశ్‌రాజ్, జయసుధగార్లకు కృతజ్ఞతలు.
– దర్శకుడు వేగేశ్న సతీశ్
హీరోగా ఫస్ట్ మూవీ అట్టర్ ఫ్లాప్.. విలన్‌గా అవార్డు
ఏం చెప్పాలో తెలియడంలేదు. హీరోగా నా ఫస్ట్ మూవీ అట్టర్ ఫ్లాప్. విలన్‌గా ఫస్ట్ మూవీకి నంది అవార్డు వచ్చింది. మా ఇంటికొచ్చిన ఎనిమిదో నంది ఇది. విలన్‌గా నంది వచ్చింది కాబట్టి, అలానే కంటిన్యూ అవుతాననుకుంటున్నారేమో. అన్ని రకాల పాత్రలూ చేస్తానండోయ్.
– నటుడు జగపతిబాబు
స్వీట్ మెమరీ
ఈ మూడేళ్లల్లో నేను చేసిన సినిమాల్లో రెండు సినిమాలు మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌గా అవార్డు దక్కించుకోవడం ఆనందంగా ఉంది. ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’, ‘శతమానం భవతి’ రెండూ మంచి చిత్రాలు. నాలుగో నంది అందుకోబోతున్నా. ‘మళ్ళీ మళ్ళీ..’లో ఇంపార్టెంట్ సీన్స్‌ని వైజాగ్ బీచ్ దగ్గర తీయడం ఓ మంచి మెమరీ. ‘శతమానం భవతి’ రాజమండ్రి షెడ్యూల్ ఓ స్వీట్ మెమరీ. ఆ సమయంలో నేను ‘అయ్యప్ప మాల’లో ఉన్నాను.
– నటుడు శర్వానంద్
మూడు అవార్డులు మా ఇంటికొచ్చాయి
సెకండ్ బెస్ట్ ఫీచర్ పిలిం, బెస్ట్ ఫస్ట్ ఫిలిం డైరెక్టర్, విజయ్ దేవరకొండకు స్పెషల్ జ్యూరీ.. మొత్తం మూడు అవార్డులు మా ‘ఎవడే సుబమ్రణ్యం’కి దక్కాయి. అవార్డులు వచ్చిన విషయాన్ని నాన్నగారు ఫోన్ చేసి చెబితేనే మాకు తెలిసింది. ఆయన చూడని అవార్డులు లేవు. కానీ, ఇప్పుడు పిల్లలు సాధిస్తుంటే ఆయనకు ఆనందంగా ఉంటుంది కదా.
– నిర్మాత స్వప్నాదత్
ముందు ‘సాక్షి’ అవార్డు... ఇప్పుడు నంది
నంది అవార్డుల్లో మైత్రీ మూవీస్ పేరు ఇంత మార్మోగడానికి కారణం ఒక వ్యక్తి. ఆయనే వన్ అండ్ ఓన్లీ కొరటాల శివగారు. మా ‘శ్రీమంతుడు’ మహేశ్‌బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక, ‘జనతా..’ హీరో ఎన్టీఆర్ సూపర్బ్. మా ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’లకు రచయితగా రామజోగయ్య శాస్త్రి అవార్డు అందుకోబోతున్నారు. అలాగే ఇతర కేటగిరీల్లోనూ అవార్డులకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. ‘శ్రీమంతుడు’కి ఫస్ట్ అవార్డు ఇచ్చింది ‘సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్’. ప్రేక్షకుల రివార్డులు కాకుండా అవార్డులు దక్కడం ఆనందంగా ఉంది.
– నిర్మాతలు రవిశంకర్, నవీన్, మోహన్
అవార్డు ఎంతో కిక్ ఇస్తుంది
నాకిది తొలి నంది అవార్డు. నా మొదటి సినిమా ‘కృష్ణమ్ వందే జగద్గురుమ్’కి మంచి పేరొచ్చింది. ఆ సినిమా తర్వాత కొంచెం గ్యాప్ వచ్చినా ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’ తర్వాత నా జర్నీ నాన్‌స్టాప్‌గా సాగుతోంది. ఏ సినిమాతో నా ప్రయాణం నిరంతరాయంగా సాగుతోందో అదే చిత్రానికి నంది అవార్డు వచ్చింది. అవార్డు ఎంతో కిక్ ఇస్తుంది. అవార్డులు ఎన్నొచ్చినా ఇంకా ఇంకా రావాలి.. తీసుకోవాలని ఉంటుంది. ఒకరకంగా అది స్వార్థం. దానికి అంతే ఉండదు. ‘కృష్ణమ్ వందే..’కి క్రిష్ రచయితగా నాకు తొలి అవకాశం ఇచ్చినప్పుడు ఎంత ఆనందపడ్డానో... అంతటి ఆనందం అవార్డు వచ్చినప్పుడు పొందుతున్నా.
– రచయిత సాయిమాధవ్ బుర్రా
గురువుగారు చెప్పిన జోస్యం నిజమైంది
భగవంతుడు ఇవ్వదలుచుకుంటే ఎంతైనా ఇస్తాడు. ఈ మాట ఎందుకంటున్నానంటే రచయితగా నా మనసుకు నచ్చిన రెండు పాటలకు అవార్డులు రావటం నా ఆనందాన్ని ద్విగుణీకృతం చేసిందనే చెప్పుకోవాలి. నందులు దక్కిన వార్త తెలిసినప్పుడు ఈ అవార్డులకు కారణమైన ఇద్దరి ఎదురుగా నేను కూర్చుని ‘భరత్ అనే నేను’ సినిమాకి చెన్నైలో పని చేస్తున్నా. ఆ ఇద్దరు ఎవరో కాదు... చిత్రదర్శకులు కొరటాల శివ, సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్. ‘శ్రీమంతుడు’ చిత్రంలోని ‘పోరా శ్రీమంతుడా...’, ‘జనతా గ్యారేజ్’లోని ‘ప్రణామం ప్రణామం..’ పాటలకు కచ్చితంగా అవార్డులు వస్తాయని మా గురువుగారు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు ముందుగానే జోస్యం చెప్పారు. ఎంతో సంతోషమైన రోజుగా నాకు గుర్తుండిపోతుంది.
– గీత రచయిత రామజోగయ్య శాస్త్రి
కథనే నమ్మి సినిమా తీస్తా.. ప్రామిస్
మా చిత్రంలో పెద్ద స్టార్లు లేరు, భారీ బడ్జెట్టూ లేదు. కథపై నమ్మకంతో ‘పెళ్ళిచూపులు’ తీశాం. మంచి కథ, కథనంతో రూపొందిన చిత్రాల్ని ఆదరించే ప్రేక్షకులకు నా థ్యాంక్స్. ప్రేక్షకాదరణ, వాళ్ల మద్దతు లేకుండా మేం ఏమీ చేయలేం. ఎప్పుడైనా అంతిమ తీర్పు ప్రేక్షకులదే. వాళ్లు వంద రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని సినిమా చూడకపోతే... మేము ఎన్ని సినిమాలు తీసినా ప్రయోజనం ఏముంటుంది? అందువల్ల, భవిష్యత్తులోనూ కథను నమ్మే సినిమాలు తీస్తా.. ప్రామిస్.
– నిర్మాత రాజ్ కందుకూరి
అవార్డు వస్తే కష్టాన్ని మరచిపోతాం
మా లైఫ్‌లో ఓ మైలురాయి వంటి సినిమా ‘లెజెండ్’. ఫైట్ మాస్టర్లుగా మాకు చాలా శాటిస్‌ఫ్యాక్షన్ ఇచ్చిన సినిమా. దర్శకుడు బోయపాటిగారు మంచి కథను అందించారు. కథకు అనుగుణంగా బాలయ్యబాబుగారి ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఫైట్స్ డిజైన్ చేశాం. వాళ్లిద్దరికీ థ్యాంక్స్. మాకొచ్చిన ఆరో నంది అవార్డు ఇది. ఫైట్ మాస్టర్ల వర్క్ ఎంతో రిస్క్, కష్టంతో కూడుకున్నది. ఇటువంటి అవార్డులు వచ్చినప్పుడు మా కష్టాన్ని మర్చిపోతాం. వుయ్ ఆర్ సో హ్యాపీ.
– ఫైట్ మాస్టర్లు రామ్–లక్ష్మణ్
చాలా సంతోషంగా ఉంది
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ఎన్టీఆర్ జాతీయ అవార్డు (2016) సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు వచ్చింది. ఆయనకు శుభాకాంక్షలు. ఇదే అవార్డుతో నన్ను కూడా (2014) గౌరవించినందుకు ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు. నా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి మీరు (తెలుగు) అందిస్తున్న సపోర్ట్‌కు రుణపడి ఉంటాను. చాలా
సంతోషంగా ఉంది. కృతజ్ఞతలు.
– నటుడు కమల్‌హాసన్
నా హీరోలు విజేతలు కావడం ఆనందం
ఉత్తమ నటుడు విభాగంలో విజేతలుగా నిలిచిన మహేశ్‌బాబు, ఎన్టీఆర్‌లకు... నంది పురస్కార విజేతలందరికీ అభినందనలు. రామజోగయ్య శాస్త్రికి రెండు పురస్కారాలు రావడం హ్యాపీగా ఉంది. నిజంగా... ఆయన రాసిన గొప్ప సాహిత్యానికి, అర్హతకు తగిన గుర్తింపు ఇది. ‘మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్’ (కొరటాల దర్శకత్వం వహించినవి) సినిమాలను ప్రశంసించిన నంది కమిటీకి కృతజ్ఞతలు. నేను తీసిన మూడు సినిమాల్లో హీరోలు (ప్రభాస్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్) నంది పురస్కారాల్లో విజేతలుగా నిలవడం సంతోషంగా.. గర్వంగా ఉంది.
– దర్శకుడు కొరటాల శివ
మూడు నందులకు మరో రెండు తోడు
‘మనలో ఒకడు’ సినిమా తృతీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డుకి ఎంపిక అవడం ఒక నటుడిగా, దర్శకునిగా చాలా సంతోషంగా ఉంది. ‘బ్రోకర్’ సినిమా నచ్చిన ప్రతి ఒక్కరికీ ‘మనలో ఒకడు’ చిత్రం నచ్చుతుంది. మా సినిమా విడుదల టైమ్‌లో నోట్ల రద్దు వల్ల ప్రేక్షకులకి సరిగ్గా రీచ్ కాలేదు. ఈ అవార్డుతో ఇప్పుడు వారికి ఇంకా బాగా రీచ్ అవుతుందనుకుంటున్నా. ఇప్పటికే ఇంట్లో మూడు నందులున్నాయి. మరో రెండు నందులు రానున్నాయి. అవార్డులొచ్చినా.. రాకున్నా సినిమా పట్ల నేనెప్పుడూ బాధ్యతాయుతంగానే ఉంటానే కానీ బాధ్యతారహిత్యంగా ఉండను. ఇకపైనా బాధ్యతగానే పనిచేస్తా.
– ఆర్పీ పట్నాయక్
అవార్డు ఊహించలేదు
నంది వస్తుందని అసలు ఊహించలేదు. వెరీ హ్యాపీ! అవార్డులు మన బాధ్యతను పెంచుతాయి. కుటుంబ సభ్యులు, మా ‘కార్తికేయ’ టీమ్, ఇండస్ట్రీలో స్నేహితులు సంతోషంతో ఫోన్లు చేస్తుంటే... మనకు నంది అవార్డు వచ్చిందనే దానికన్నా ఇంకా ఎక్కువ సంతోషంగా ఉంది. సమష్టి కృషి ఫలితమే ‘కార్తికేయ’. ఈ సందర్భంగా మా టీమ్ అందరికీ థ్యాంక్స్. వాళ్లకు నేనెప్పుడూ రుణపడి ఉంటాను.
– దర్శకుడు చందూ మొండేటి
పేరు.. అవార్డూ దక్కడం ఆనందం
నాకు నచ్చింది నేను చేస్తున్నాను. ప్రతి స్త్రీ తను అనుకుంటున్నట్లుగా తను జీవించాలి. నేనలానే జీవిస్తాను. నా డ్రీమ్స్‌ని నెరవేర్చుకోవడానికి కృషి చేస్తా. ప్రతి అవార్డు ఇంకొంచెం ఎక్కువ పని చేయడానికి ఉత్సాహాన్నిస్తుంది. ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డు వచ్చినప్పుడు చేసిన కష్టం మరచిపోతాం. ‘చందమామ కథలు’లో లీసా స్మిత్ క్యారెక్టర్ గురించి దర్శకుడు ప్రవీణ్ సత్తారు చెప్పి, ఈ పాత్ర మీరు చేయకపోతే సినిమా చేయనన్నారు. ఆ పాత్రకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు అవార్డు కూడా దక్కినందుకు ఆనందంగా ఉంది.
– నటి మంచు లక్ష్మీప్రసన్న
Comments
Please login to add a commentAdd a comment