అప్పుడు ఎలా నటించాలో తెలియదు!
‘‘యాభై సంవత్సరాల క్రితం ‘తేనె మనసులు’ చిత్రంలో నటించాను. నాతోపాటు చాలామంది కొత్తవాళ్లతో ఆదుర్తి సుబ్బారావుగారు ఆ చిత్రం తీసి, హిట్ చేశారు. ఆ చిత్రానికి నేను సెలక్ట్ అయినప్పుడు డ్యాన్స్, ఫైట్స్, ఎలా నటించాలో కూడా తెలియదు. నాలుగైదు నెలలు ట్రైనింగ్ ఇచ్చి మరీ సినిమా తీశారు. కానీ, ఈ తరం వారు రెండు మూడేళ్లు అన్ని రంగాల్లో శిక్షణ తీసుకుని సినిమా ఇండస్ట్రీకి వస్తున్నారు. నవీన్ కూడా శిక్షణ తీసుకున్నాడు. తనకు మీ ఆశీర్వాదం (అభిమానులు) ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని సూపర్‌స్టార్ కృష్ణ అన్నారు.
సీనియర్ నటుడు నరేశ్ తనయుడు నవీన్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘నందిని నర్సింగ్ హోమ్’. శ్రావ్య, నిత్య హీరోయిన్లు. పీవీ గిరి దర్శకత్వంలో రాధాకిషోర్.జి, బిక్షమయ్య సంగం నిర్మించారు. అచ్చు స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని హీరో మహేశ్‌బాబు విడుదల చేసి కృష్ణకు అందించారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడుతూ- ‘‘నవీన్ నాకు చిన్నప్పట్నుంచి తెలుసు. ‘అతడు’, ‘పోకిరి’ చిత్రాలప్పుడు ఎక్కువగా కలిసేవాళ్లం.
నా చిత్రాలకు ఫైట్స్ కూడా ఎడిటింగ్ చేశాడు. ‘ఏమవుదామనుకుంటున్నావ్’ అని ఓ సందర్భంలో అడిగితే ‘యాక్టర్ అవుతాను అన్నా!’ అన్నాడు. అప్పుడు తను జోక్ చేస్తున్నాడా? అనిపించింది నాకు. ఎందుకంటే నవీన్ అప్పుడు చాలా లావుగా ఉండేవాడు. ఏడాది తర్వాత తనని కలిస్తే బాగా సన్నబడటంతో పాటు సిక్స్‌ప్యాక్ బాడీలో కనిపించాడు. అప్పుడే తన డెడికేషన్ ఏంటో అర్థమైంది. మనం హార్డ్‌వర్క్ చేస్తే సక్సెస్ వస్తుందని నమ్ముతాను’’ అన్నారు. ‘‘కథ నచ్చడంతో మొదటి సిట్టింగ్‌లోనే నవీన్ నటించేందుకు ఒప్పుకున్నారు. క్లయిమాక్స్‌లో నవీన్ నటనకు మహేశ్ గుర్తుకొచ్చారు.
ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందనే నమ్మకం ఉంది’’ అని దర్శకుడు పీవీ గిరి పేర్కొన్నారు. ఈ వేడుకలో నటి విజయనిర్మల, సీనియర్ నటుడు నరేశ్, దర్శకులు బి.గోపాల్, ఎ.కోదండరామిరెడ్డి, త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు ఎమ్మెస్ రాజు, రాజ్ కందుకూరి, హీరోలు సుధీర్‌బాబు, సాయిధరమ్ తేజ్, సంగీత దర్శకుడు కోటి, హీరోయిన్లు శ్రావ్య, నిత్య పాల్గొన్నారు.