‘‘సాధారణంగా రివెంజ్ డ్రామా సినిమాలు సీరియస్ మోడ్‌లో నడుస్తుంటాయి. ‘గ్యాంగ్‌లీడర్’ మాత్రం సరదా యాంగిల్‌లో సాగుతుంది. విక్రమ్ నాకు కథ చెప్పినప్పుడు నేను ఎంత నవ్వానో థియేటర్లో ప్రేక్షకులు కూడా అలానే నవ్వితే సినిమా కచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుంది’’ అన్నారు నాని. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన చిత్రం ‘నానీస్ గ్యాంగ్‌లీడర్’. నవీన్ యర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మించారు. ‘ఆర్‌ఎక్స్100’ ఫేమ్ కార్తికేయ విలన్‌గా నటించారు. ఈ శుక్రవారం (సెప్టెంబర్ 13) ‘నానీస్ గ్యాంగ్‌లీడర్’ రిలీజ్ కానున్న సందర్భంగా నాని చెప్పిన విశేషాలు.
► విక్రమ్, నేను ఎప్పటినుంచో సినిమా చేయాలనుకుంటూ ఉన్నాం. ఒకరోజు ‘గ్యాంగ్‌లీడర్’ సినిమా ఐడియా చెప్పాడు. విన్న వెంటనే ఓకే అన్నాను. అప్పటికి ‘జెర్సీ’ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. ‘జెర్సీ’ పూర్తయ్యేసరికి ‘గ్యాంగ్‌లీడర్’ ప్రీ–పొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయి. వెంటనే షూట్ స్టార్ చేశాం. విక్రమ్ గత సినిమాలు ‘మనం, 24’లాగా ఈ సినిమా క్లిష్టంగా ఉండదు. చాలా సింపుల్‌గా ఉంటుంది. ‘జెర్సీ’ చాలా ఎమోషనల్ సినిమా. మానసికంగా ఎక్కువ శ్రమతో కూడుకున్నది. గ్యాంగ్‌లీడర్ చాలా సరదా సినిమా. నవ్వించడం, ఏడిపించడం, దేని కష్టం దానిదే. ఎంత నిజాయితీగా చేస్తాం అన్నదాని మీద ఉంటుంది.
► ఇందులో నేను ‘పెన్సిల్ పార్థసారథి’ అనే ప్రతీకార కథలు రాసే రచయితగా నటించాను. వాడో పెద్ద పాపులర్ రచయిత అని పార్థసారథిగాడి ఫీలింగ్. వాడు రాసిన పుస్తకాలని ఎవడూ కొనడని ఆ పుస్తకాల పబ్లిషర్‌కి కూడా తెలుసు. విలన్ మీద పగ తీర్చుకోవడానికి ఓ ఐదుగురు స్త్రీలు వీడి దగ్గరకు వస్తారు. వాళ్లతో కలసి పగ తీర్చుకుంటూ తన 29వ నవల రాస్తాడు పార్థసారథి. అదే వాడు రాసిన తొలి ఒరిజినల్ కథ.
► ఇందులో విలన్ పాత్రకు నలుగురైదుగురు హీరోల పేర్లు అనుకున్నాం. మొదట అడిగింది కార్తికేయానే. కథ వినగానే ఎగ్జయిట్ అయ్యాడు. దాంతో రెండో వాళ్లను అడగాల్సిన పని లేకుండా పోయింది.
► కృష్ణవంశీగారి సినిమాల్లో లక్ష్మీగారు భలే ఉంటారనుకున్నాను. ఆయన ఆవిడను భలే చూపించారనిపించేది. ఆవిడతో పని చేశాకే తెలిసింది.. ఆవిడ అలానే ఉంటారని. కృష్ణవంశీగారి క్రెడిట్ కాస్త తగ్గింది. (నవ్వుతూ).
► విక్రమ్ సినిమాల్లో త్వరగా షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా ఇదే. తొందర గా పూర్తి చేస్తే ఇంత కిక్ వస్తుందా? నా కళ్లు తెరిపించావు అన్నాడు విక్రమ్ (నవ్వుతూ). ‘జెర్సీ’ కోసం క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు విక్రమ్ ఈ టైటిల్ చెప్పడానికి వచ్చాడు. ‘గ్యాంగ్‌లీడర్’ అని చెప్ప గానే ఎగ్జయిట్ అయ్యాను. ఆ తర్వాత ‘గ్యాం గ్‌లీడర్’ టైటిల్‌తో ఏర్పడ్డ చిన్న కన్‌ఫ్యూజన్ వల్ల ‘నానీస్ గ్యాంగ్‌లీడర్’ గా మార్చాం. ఒకవేళ మాస్ సినిమా చేస్తే భయపడుతూ, వణికిపోతూ ఉండాలి. కానీ ఈ ‘గ్యాంగ్‌లీడర్’ జానర్ వేరే. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి పేరుని మా అబ్బాయికి పెట్టాను అనుకుందాం. అప్పుడు కాంట్రవర్సీ అవుతుందేమో అని ఆలోచిస్తానా? లేదు కదా. ఇష్టంతో, ప్రేమతో పెట్టుకున్న టైటిల్ ఇది. టైటిల్ పెట్టాం కదా అని ఆ సినిమా గుర్తుగా ఓ షాట్ పెట్టాం. సినిమా ఫుల్ ఎనర్జీతో నడుస్తుంది. ఇది ఏ సినిమాకు రీమేక్, కాపీ కూడా కాదు.
► స్కూల్ రోజుల్లో రిజర్వ్›్డగా ఉండేవాణ్ణి. మార్కులు వస్తే ధైర్యంగా ఉంటుంది. అందుకే సైలెంట్‌గా ఉండేవాణ్ణేమో (నవ్వుతూ). అయితే మా గల్లీలో నేనే గ్యాంగ్‌లీడర్. అందరూ నాకంటే చిన్నోళ్లు ఉండేవారు. అక్కడ రెచ్చిపోయేవాణ్ణి.
► నేను కేవలం యాక్టర్‌ని. కమర్షియల్ సినిమాలో చూస్తే కమర్షియల్ యాక్టర్‌లా, ‘జెర్సీ’లాంటి సినిమాలో చూస్తే జస్ట్ యాక్టర్‌గానే కనిపిస్తాను. మీరు ఎలా చూస్తారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది.. అంతే. ‘సక్సెస్ రేట్’ అనే విషయాన్ని నేను నమ్మడం మానేశాను. పది హిట్లు ఇచ్చి ఒక్క ఫ్లాప్ ఇచ్చినా ‘నానీ కష్టాల్లో’ ఉన్నాడు అంటున్నారు. అలాంటప్పుడు ప్రతి సినిమా ముఖ్యమే. సక్సెస్ గురించి ఆలోచిస్తూ ఈ సినిమా ఆడుతుందా? ఆడదా అని లెక్కలు వేసుకోవడం మానేశా. నచ్చింది చేస్తున్నాను.
► కథ కచ్చితంగా చెప్పాల్సింది అయితేనే ద్విభాషా చిత్రం చేస్తాను. గతంలో అలా చేసే చాలా సమయం వృ«థా అయింది. బాలీవుడ్‌కు వెళ్లే ఆలోచనలు లేవు. వెళ్లినా నన్ను తరిమేస్తారు. అది నాకు తెలుసు (నవ్వుతూ).
► మా నిర్మాణంలో చేసిన ‘అ!’ సినిమాకు రెండు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. త్వరలోనే కొత్త సినిమా ప్రకటిస్తాం. ప్రస్తుతం మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ‘వి’ సినిమా చేస్తున్నాను.
► ‘జెర్సీ’ సక్సెస్ నాకు సంతోషాన్ని ఇచ్చింది. ప్రస్తుతం మార్కెట్‌లో అమ్ముడుపోతున్న అంశాలేవీ లేకుండా ఈ సినిమా చేశాం. అది 30 కోట్ల షేర్ వసూళ్లు చేసింది. ఇతర భాషల్లోనూ రీమేక్ అవుతోంది. దాన్ని ‘సరిగ్గా ఆడలేదు’ అని ఎలా అంటాం? ‘ఎంసీఏ’ అప్పుడు కలెక్షన్లు బాగా వస్తున్నాయి. ‘డబ్బులు సరేగానీ మంచి సినిమాలు చేయడా?’ అన్నారు. ‘జెర్సీ’ అప్పుడు ‘మంచి సినిమాలు సరే, కలెక్షన్లలో ‘ఎంసీఏ’ని కొడుతుందా లేదా?’ అంటారు. ‘జెర్సీ’కి 400 శాతం డబ్బులు వచ్చినట్టు.
► నాకు సినిమా చూడటం బాగా ఇష్టం. కేవలం ప్రేక్షకుడిలానే చూస్తాను. నేను యాక్టర్ కానప్పుడు నాలో ఉన్న ప్రేక్షకుడికి ఆ కాలం సినిమాలు నచ్చాయి. యాక్టర్‌గా మారిన తర్వాత నాలో ఉన్న ప్రేక్షకుడికి ఇప్పటి సినిమాలు నచ్చుతున్నాయి. ప్రేక్షక్షకుడు మారితే నేను మారినట్టే. నా సినిమాలు తప్పితే అన్ని సినిమాలను ప్రేక్షకుడిలానే చూస్తాను.
► నటుడిగా 11 ఏళ్లు అంటే చాలా ఎక్కువ ప్రయణమే అనిపిస్తోంది. నాకు మాత్రం ఎలా గడిచిపోయిందో అర్థం కావడం లేదు. నాకు పని చేయడమే హాలిడే అన్నట్టు. బ్రేక్ తీసుకుంటే టార్చర్‌గా, ఏదో కష్టపడుతున్న ఫీలింగ్ వస్తుంది. షూటింగ్ చేస్తున్నప్పుడు రోజులు ఎలా గడుస్తుంటాయో తెలియదు. పూర్తయ్యాక ప్రమోషన్స్ అప్పుడు కొంచెం ఇబ్బందే (నవ్వుతూ).
నేను మా గల్లీ గ్యాంగ్‌లీడర్‌ని
Published Sun, Sep 8 2019 12:15 AM | Last Updated on Sun, Sep 8 2019 9:20 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment