
ఎర్ర చొక్కా.. నల్ల బనియన్.. గళ్ల లుంగీ.. మెడలో తాయత్తు.. కత్తులను తలపిస్తున్న కోరమీసాలు.. రఫ్ గడ్డం.. పదునైన చూపులు.. సంక్రాంతి సందర్భంగా ఇలా పక్కా మాస్ లుక్‌లో ప్రత్యక్షమయ్యారు నాని. ఆయన తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తోన్న సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి సమర్పణలో సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.
అనుపమా పరమేశ్వరన్, రుక్సార్ మీర్ కథానాయికలు. కృష్ణ పాత్రలో నాని ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో సరికొత్త నానీని తెరపై చూడనున్నారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. హిప్ హాప్ తమిళ స్వరాలు, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఏప్రిల్ 12న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.