చిలకా పద.. పద...
వెండితెరపై కొత్త కథానాయిక మెరిస్తే చాలు... ఆ కథానాయిక జాతకం ఎలా ఉంటుంది? అని కొంతమంది ఓ అంచనాకు వచ్చేస్తారు. తమిళ చిత్రం ‘అయ్యా’, ఆ తర్వాత ‘చంద్రముఖి’లో నయనతారను చూసినప్పుడు కూడా అప్పటికే ఫామ్‌లో ఉన్న కథా నాయికలు ఓ అంచనా వేశారు. ‘ఏం ప్రాబ్లమ్ లేదు.. మహా అయితే నాలుగైదు సినిమాలు చేస్తుందేమో. అది కూడా గ్లామరస్ క్యారెక్టర్స్‌కి పనికి రాదు. హోమ్లీ క్యారెక్టర్స్ ఎన్నని వస్తాయి?’ అనుకుని రిలాక్స్ అయ్యారు.
కానీ, ఎవరూ ఊహించని విధంగా నయనతార మారిపోయారు? ఏ హీరోయిన్లైతే ఆమెను లైట్ తీసుకున్నారో అదే హీరోయిన్లను టెన్షన్‌కి గురి చేశారు. ‘గజిని’, ‘శివకాశి’, ‘లక్ష్మి’ వంటి చిత్రాల్లో కనిపించిన నయనతారకూ, ‘బాస్’ చిత్రంలో కనిపించిన నయనతారకూ అసలు సంబంధమే లేదు. ఈ రేంజ్‌లో కూడా మేకోవర్ అవ్వగలుగుతారా? అని అందరూ ముక్కు మీద వేలేసుకునేలా నయనతార సన్నబడిపోయారు.
చిక్కిన తర్వాత ఇంకా అందంగా తయారయ్యారు. గ్లామరస్ క్యారెక్టర్స్‌కి పనికొస్తానని నిరూపించుకున్నారు. మొత్తానికి పదేళ్లుగా ఎక్కడా తగ్గకుండా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల తనంతట తానుగా కొన్ని నెలలు గ్యాప్ తీసుకున్నారు తప్ప నయనతారకు ఎప్పుడూ అవకాశాలు తగ్గలేదు.
ఒకవైపు రజనీకాంత్ వంటి సీనియర్ హీరో సరసనా సరిజోడీ అనిపించుకున్నారు. మరోవైపు ప్రభాస్, ఎన్టీఆర్, రానా వంటి కుర్ర హీరోలకు సరిజోడీ అనిపించుకోవడం నయనతారకు ప్రత్యేకత. అటు తమిళంలోనూ సూర్య, అజిత్ వంటి హీరోలతో జతకడుతూ ఆర్య, జీవా వంటి కుర్ర హీరోలతో కూడా చేస్తున్నారు. బహుశా నయనతారకు అవకాశాలు తగ్గకపోవడానికి అదో కారణం అయ్యుండొచ్చు. ఇక నటిగా, ‘శ్రీరామరాజ్యం’లో సీతగా అద్భుతంగా అభినయించారామె.
అలాగే ‘అనామిక ’, ‘మాయ’ వంటి చిత్రాల ద్వారా లేడీ ఓరియంటెడ్ చిత్రాలు కూడా చేయగలనని నిరూపించుకున్నారు. ఏదేమైనా కొత్త నాయికలు వచ్చినప్పుడు పాత నాయికలు తగ్గాల్సిందే కదా. పైగా నయనతార తర్వాత చాలామంది కథానాయికలు వచ్చారు. దాంతో ఈ థర్టీ ప్లస్ ఏజ్ హీరోయిన్ హవా తగ్గుతుందని కొంతమంది ఊహించారు.
అందరి ఊహలనూ తలకిందులు చేస్తూ ఇప్పుడు ఆరేడు చిత్రాలతో నయనతార బిజీగా ఉన్నారు. వీటిలో ఒకటి లేడీ ఓరియంటెడ్ మూవీ కావడం విశేషం. తమిళంలో ఐదు సినిమాలు, తెలుగులో హీరో వెంకటేశ్ సరసన ‘బాబూ బంగారం’ చేస్తున్నారు. చేతిలో ఇన్ని సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారో తెలుసుకోవడానికి నయనతార ప్రత్యేకంగా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూస్తున్నారట.
ఈ మధ్య చెన్నైలో పలు పబ్లిక్ థియేటర్స్‌లో ఈ బ్యూటీ కనిపించారట. ప్రేక్షకుల నాడి తెలుసు కుని, అందుకు అనుగుణంగా సినిమాలే ఒప్పుకుంటారేమో. రజనీకాంత్ సరసన నయనతార నటించిన ‘చంద్రముఖి’లో ‘చిలకా పద.. పద...’ అనే పాట ఉంది. సో.. నటిగా ఈ చిలక ప్రయాణం ఆ పాటలా మరో నాలుగైదేళ్లు జోరుగా ఉంటుందన్నమాట.