నా అదృష్ట దేవత నయనతార
హీరో హీరోయిన్లు ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకోవడం అన్నది కొత్తేమి కాదు. అయితే నటుడు ఆర్యను మాత్రం చాలా మంది హీరోయిన్లు రియల్ హీరోగా పేర్కొంటుంటారు. అందరితోనూ కలుపుగోలుతనంగా మసులుకోవడం వల్లే ఆర్య అందరికీ ఇష్టంగా మారారన్నది హీరోయిన్ల మాట. ఆయన ప్లేబాయ్ అని అందుకే హీరోయిన్లు లైక్ చేస్తారన్నది సినీ వర్గాల మాట. ఏదేమయినా క్రేజీ భామలు అనుష్క, నయనతార, హన్సిక వంటి వారు ఆర్య మంచి స్నేహితుడంటూ కితాబిస్తుంటారు. మరి ఆర్య ఏమంటున్నారో తెలుసా? నయనతార తన అదృష్ట దేవత అంటున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన బాస్ ఎన్గిర భాస్కరన్, ఇటీవల నటించిన రాజారాణి విశేష ప్రజాదరణ పొందాయి.
అయితే ఈ చిత్రాల షూటింగ్ సందర్భంగా ఈ జంటపై పలు రకాల వదంతులు వచ్చాయి. ఇవి జరిగి చాలా రోజులైనా ఆర్య మళ్లీ వీటి ప్రస్తావన తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. ఆయన మాట్లాడుతూ రాజారాణి చిత్ర ప్రచారంలో భాగంగా తనకు నయనతారకు వివాహం అంటూ ఆహ్వాన పత్రికలతో ప్రచారం చేశారన్నారు. దీనికి చాలా మంచి పబ్లిసిటీ లభించిందన్నారు. అయితే ఇది ఇక్కడితో ఆగలేదన్నారు. బయట ఎక్కడ చూసినా అభిమానులు నయనతారను పెళ్లి చేసుకోబోతున్నారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించడం ప్రారంభించారని తెలిపారు.
అది చిత్ర ప్రచారంలో భాగం అని వివరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. నిజం చెప్పాలంటే నయనతార తన అదృష్ట దేవత అని వ్యాఖ్యానించారు. ఆమెతో కలిసి నటించే అవకాశం రావడం తనకు లభించిన అదృష్టం అని పేర్కొన్నారు. మీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా? అని మీడియా వర్గాలు అడుగుతున్నారని సినీ పరిశ్రమలో ఇలాంటి వదంతులు సహజం అని అన్నారు. నిజానికి తమ ఇరువురికి అలాంటి ఆలోచన లేదని ఆర్య స్పష్టం చేశారు. అయితే నయనతారను అదృష్ట దేవతగా సంబోధించాల్సిన అవసరమేమిటని కోలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.