సాటి నటుడి గురించి మంచిగా మాట్లాడినా తప్పేనా?
నయనతారకు వ్యక్తిగతంగా కోలీవుడ్ అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. కెరీర్ పరంగా విజయాలు అందుతున్నాయని ఆనందపడాలో... వ్యక్తిగతంగా రూమర్లు వెంటాడుతున్నాయని బాధ పడాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు ప్రస్తుతం నయన. ఇటీవలే... ‘ఆరంభం’తో తమిళనాట మంచి విజయం అందుకున్నారామె. ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్న తరుణంలో.. తాజాగా ఓ కొత్త గాసిప్ ఆమెను మానసికంగా బాధకు గురిచేసింది.
వివరాల్లోకెళితే.. ఉదయ్నిధి స్టాలిన్ సరసన ‘ఇదు కదిర్వేలన్ కాదల్’ అనే చిత్రంలో నటిస్తున్నారు నయన. ఈ చిత్రానికి నిర్మాత కూడా ఉదయ్నిధే కావడం విశేషం. మీడియా సమావేశాలకు అరుదుగా హాజరయ్యే నయన... ఇటీవల నిర్వహించిన ఈ సినిమా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. నయన చేసిన తప్పిదం అదే.
ఈ సమావేశంలో నయన మాట్లాడుతూ ‘‘ఉదయ్కి ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఆయన నటించిన ప్రతి సినిమాలోనూ అది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సాధారణంగా వర్ధమాన నటులతో నటించేటప్పుడు కాస్త టెన్షన్ ఉంటుంది. అయితే నాకు ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే... తనతో నటించేటప్పుడు నాకు ఎలాంటి టెన్షనూ కలగలేదు. ఓ గొప్ప స్టార్తో నటిస్తున్న ఫీలింగ్’’ అని ఉదయ్ని పొగడ్తలతో ముంచెత్తారు. ఇంకేముంది కట్ చేస్తే... ‘‘ఉదయ్ని అంతగా పొగడటానికి కారణం ఏంటి? నయనకీ ఉదయ్కీ మధ్య ఏం నడుస్తోందీ..’ అంటూ కోలీవుడ్ మీడియాలో కథనాలు మొదలయ్యాయి. దాంతో నయన తీవ్ర అసహనానికి లోనయ్యారు. ‘‘నా జీవితంలో ఎదురైన చేదు అనుభవాల కంటే... మీడియాలో వచ్చిన కథనాలే నన్ను ఎక్కువగా బాధించాయి... బాధిస్తున్నాయి. సాటి నటుడి గురించి కాస్త మంచి మాటలు చెప్పినా తప్పేనా?’’ అని వాపోయారు నయన.