దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో ప్రకంపనలు సృష్టించిన ‘మీటూ ఉద్యమం’ మరోసారి తెరపైకి వచ్చింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు అను మాలిక్... పాటల కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా రావడమే ఇందుకు కారణం. పని ప్రదేశాల్లో మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాల గురించి బట్టబయలు చేస్తూ హాలీవుడ్‌లో మొదలైన మీటూ ఉద్యమం.. భారత్‌లోనూ క్రమంగా వ్యాపించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నటి తనూశ్రీ దత్తా.. విలక్షణ నటుడు నానా పటేకర్‌పై చేసిన లైంగిక ఆరోపణలతో ఉధృతమైన ఈ ఉద్యమం సినిమా, క్రీడలు, జర్నలిజం ఇలా ప్రతీ రంగంలో పెద్ద మనుషులుగా చెలామణీ అవుతున్న ఎంతో మంది మృగాళ్ల నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. ఇందులో భాగంగా ప్రముఖ గాయనీమణులు శ్వేతా పండిట్, సోనా మహాపాత్ర అను మాలిక్ తమ పట్ల ప్రవర్తించిన తీరును ప్రపంచానికి చాటి చెప్పారు.
ఈ నేపథ్యంలో తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అను మాలిక్‌ను ఇండియన్ ఐడల్ ప్రోగ్రాం నుంచి నిర్వాహకులు తొలగించారు. అయితే సెప్టెంబరులో మళ్లీ అతడిని న్యాయ నిర్ణేతగా తీసుకురావడం పట్ల ప్రముఖ గాయని నేహా బాసిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్పీ రేట్ల కోసం అతడిని మళ్లీ తీసుకువచ్చామంటూ నిర్వాహకులు తనతో చెప్పారని.. ఇది సరికాదంటూ మరోసారి గళమెత్తిన సోనాకు ఆమె అండగా నిలిచారు. ‘నేను నీతో ఏకీభవిస్తున్నాను. లింగవివక్ష కలిగిన ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. అందులో అను మాలిక్ ఒక దిగజారుడు వ్యక్తి. 21 ఏళ్ల వయస్సులో నేను కూడా అతడి అసహజ చర్యల నుంచి తప్పించుకుని పారిపోయాను. ఓ రోజు స్టూడియోకు వెళ్లిన సమయంలో సోఫా మీద పడుకుని ఎదురుగా నన్ను కూర్చోమంటూ నా కళ్ల గురించి వర్ణించడం మొదలుపెట్టాడు. అయితే నేను మాత్రం వెంటనే విషయాన్ని పసిగట్టి కింద అమ్మ ఎదురుచూస్తోంది అని అబద్ధం చెప్పి అతడి నుంచి తప్పించుకున్నాను. ఆ తర్వాత కూడా అతడు నాకు మెసేజ్‌లు, కాల్స్ చేసి విసిగించేవాడు. కానీ నేను మాత్రం వాటికి స్పందించకుండా మిన్నకుండిపోయాను. అతడు ఒక క్రూర జంతువు’ అని పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా నేహా చేసిన వ్యాఖ్యలకు పలువురు నెటిజన్లు మద్దతు పలుకుతున్నారు. అను మాలిక్‌ను తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కాగా జాగ్ ఘూమియా వంటి హిట్‌సాంగ్స్‌తో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నేహా.. తెలుగులోనూ అటు నువ్వే ఇటు నువ్వే(కరెంట్), నిహారికా నిహారికా(ఊసరవెళ్లి), స్వింగ్ జరా(జై లవ కుశ) తదితర పాటలు పాడి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.
I agee with you. We do live in a very sexist world. Anu Malik is a predetor, i too have run away from his strange moves when i was 21. I didn't let myself get into a sticky situation beyond him lying on a sofa in front of me talking about my eyes in a studio. I fleed lying https://t.co/tQgStLrYyT
— Neha Bhasin (@nehabhasin4u) October 30, 2019
Comments
Please login to add a commentAdd a comment