
మరో ఐదేళ్లలో సింగం–4
టీనగర్: మరో ఐదేళ్లలో సింగం–4 చిత్ర దర్శకత్వం చేపట్టనున్నట్లు హరి తెలిపారు. ఇటీవల ఆయన ఒక చిత్ర విజయోత్సవంలో ఈ వివరాలు వెల్లడించారు. హరి దర్శకత్వంలో సూర్య నటించిన సింగం చిత్రం 2010లో విడుదలైంది. 2013లో సింగం–2, 2017లో సింగం–3 రిలీజై ప్రదర్శించబడుతున్నాయి. ఊహించిన విధంగానే వీటికి అభిమానుల నుంచి అనూహ్య స్పందన లభించింది. తర్వాత సింగం–4 ఎప్పుడు విడుదలవుతుందా? అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. దీనికి సమాధానమిచ్చే విధంగా ఇటీవల సింగం–3 తెలుగు చిత్ర విజయోత్సవంలో హరి వివరాలు వెల్లడించారు.
మరోఐదు లేదా ఆరేళ్లలో సింగం చిత్రం నాలుగో భాగాన్ని రూపొందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం విక్రమ్ నటించిన సామి చిత్రం రెండవ భాగానికి దర్శకత్వం వహిస్తానని, ఈ చిత్రం ముగియగానే మళ్లీ సూర్య నటించే మరో చిత్రానికి దర్శకత్వం వహిస్తానని అన్నారు. ఈ రెండు చిత్రాల్లో పాత్రలు ఎంతో భిన్నంగా ఉంటాయని తెలిపారు. హరి చేసిన ఈ ప్రకటనతో సామి–2, సూర్య నటించే చిత్రం కోసం అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.