
మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదు
బాలీవుడ్‌లో బిజీ అయిపోయిన ప్రభుదేవా, చాలా రోజుల తర్వాత చెన్నై వెళ్లారు. అజయ్ దేవగన్, సోనాక్షీ సిన్హా కాంబినేషన్‌లో ఆయన తెరకెక్కించిన ‘యాక్షన్ జాక్సన్’ హిందీ చిత్రం ప్రమోషన్ కోసం ఆయన చెన్నైలో సందడి చేశారు. ఈ సందర్భంగా మీడియాతో తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ -‘‘నాకు మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. ఒంటరి జీవితమే బాగుంది.
ప్రస్తుతం నా దృష్టి అంతా సినిమాల మీదే. చెన్నై వస్తే పిల్లలతో గడపకుండా వెళ్లను’’ అని చెప్పారు. చిరంజీవితో ఇంతకు ముందు ‘శంకర్‌దాదా జిందాబాద్’ చేశారు కదా. ఇప్పుడాయన 150వ చిత్రానికి దర్శకత్వం చేసే అవకాశమొస్తే చేస్తారా? అని ప్రశ్నిస్తే -‘‘చిరంజీవిగారి చిత్రానికి దర్శకత్వం చేయాలంటే అదృష్టం ఉండాలి. అలాంటి అవకాశం కోసం చాలామంది ఎదురుచూస్తుంటారు. ఆయన సినిమాకి నృత్య దర్శకత్వం చేయమన్నా చేస్తాను’’ అని ప్రభుదేవా తెలిపారు.