
ఆదర్శవంతంగా శ్రీమంతుడు!
హైదరాబాద్: ఒక ఊరిని దత్తత తీసుకుని అభివృద్ధి చేసే కాన్సెప్ట్‌తో వచ్చిన మూవీ శ్రీమంతుడు. హీరో మహేష్ బాబు కెరీర్ లో ఈ సినిమా మంచి విజయం సాధించి.. కలెక్షన్లలో దూసుకుపోతోంది. దీంతో పాటు ఈ సినిమా పలువురికి ఆదర్శవంతంగా కూడా నిలుస్తోంది. రూ.కోట్లు సంపాదించినా.. దేశ, విదేశాల్లో స్థిరపడినా.. లగ్జరీ జీవితం గడుపుతున్నా.. పుట్టి, పెరిగిన ఊరికి ఏమైనా చేయాలనే తపన పలువురి మనసులను తాకింది.
ప్రస్తుతం శ్రీమంతుడు ఢిల్లీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర మంత్రులు, ఎంపీలను సైతం శ్రీమంతుడు విపరీతంగా ఆకర్షించింది. కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ఢిల్లీలోని తన సహచరుల వద్ద శ్రీమంతుడు సినిమా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారట. ఇదిలా ఉండగా ఈ సినిమాను చూసి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారకరామరావు ప్రశంసలు కురిపించారు. పల్లెలను అభివృద్ధి చేయూలని సీఎం కేసీఆర్ ప్రారంభించిన గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని శ్రీమంతుడు సినిమాతో పోల్చారు. దీంతో పాటు సినిమాను చూసిన పలువురు నటులు సైతం శ్రీమంతుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. టాలీవుడ్ హీరో వెంకటేశ్ తో సహా పలువురు మహేష్ బాబును ప్రత్యేకంగా కలిసి అభినందించారు. ఈ సినిమాలోని చక్కటి సందేశం వాణిజ్యపరంగా లాభాలను తెచ్చిపెడుతుందని నటుడు మరో హీరో కమల్ హాసన్ వ్యాఖ్యానించారు.