
మాజీ ప్రియుడితో మళ్లీ?
గాసిప్
రణ్‌బీర్ కపూర్‌తో బ్రేకప్ అయ్యాక, సల్మాన్‌ఖాన్‌తో కత్రినా కైఫ్ మునుపటి స్నేహాన్ని మళ్లీ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత బంధాన్ని మాత్రమే కాదు.. వృత్తిపరమైన బంధాన్ని కూడా ఆమె కొనసాగించాలనుకుంటున్నారట. మళ్లీ ఈ కండలవీరుడితో సినిమాలు చేయాలనుకుంటున్నారని సమాచారం. సల్మాన్ కూడా క్యాట్‌తో జతకట్టడానికి ఉత్సాహంగా ఉన్నారట. తన తదుపరి చిత్రాల్లో కత్రినా కైఫ్‌ను కథానాయికగా తీసుకోమని దర్శక-నిర్మాతలతో అంటున్నారట.
అనడమే కాదు.. ఒత్తిడి చేస్తున్నారని కూడా వినికిడి. తాజాగా ఆయన దర్శక-నిర్మాత కరణ్‌జోహార్‌తో సినిమా చేసే సన్నాహాల్లో ఉన్నారు. ఈ చిత్రంలో ఎలాగైనా కత్రినాను కథానాయికగా చేయించాలని సల్మాన్ అనుకున్నారట. కరణ్ జోహార్ కూడా అందుకు సిద్ధపడ్డారని భోగట్టా. చివరి నిముషంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను తీసుకోవాలనుకుంటున్నారట. సడన్‌గా తెరపైకి జాక్వెలిన్ ఎందుకు వచ్చింది? అనే విషయం బాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ ఆ పాత్రకు కత్రినా సూట్ కాదని సల్మాన్‌ని కరణ్ ఒప్పించి ఉంటారా? అనే దిశగా చర్చలు సాగుతున్నాయి. మరి.. కథానాయికగా ఎవరు నటిస్తారు? అనేది కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది.