
చైతూకి రెండోది... శర్వాకు మొదటిది!
‘ప్రేమమ్’... నాగచైతన్య నటించిన చక్కటి ప్రేమకథా చిత్రాల్లో ఇదొకటి! సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
‘ప్రేమమ్’... నాగచైతన్య నటించిన చక్కటి ప్రేమకథా చిత్రాల్లో ఇదొకటి! సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. వెంకటేశ్‌తో ‘బాబు బంగారం’ను నిర్మించిందీ ఈ సంస్థే. ఈ రెండిటికీ సూర్యదేవర నాగవంశీ నిర్మాత. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో వరుసగా చిత్రాలను నిర్మిస్తున్న ‘హారికా అండ్ హాసిని క్రియేషన్స్’కు ఈ సితార అనుబంధ సంస్థ అన్న విషయం విదితమే.
ఈరోజు ‘హారికా అండ్ హాసిని’ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) పుట్టినరోజు సందర్భంగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ రెండు చిత్రాలను ప్రకటించారు. నాగచైతన్య (చైతూ) హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం, శర్వానంద్ (శర్వా) హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో మరో చిత్రం నిర్మించనున్నట్టు తెలిపారు. ఈ సంస్థలో చైతూకి ఇది రెండో చిత్రం కాగా, శర్వాకు మొదటిది. ‘‘ఈ రెండు చిత్రాలకు సంబంధించిన వివరాలు త్వరలోనే ప్రకటించి, చిత్రాలను ప్రారంభిస్తాం’’ అని చిత్రసమర్పకులు పీడీవీ ప్రసాద్ తెలిపారు.