
శివకార్తికేయన్‌తో మరోసారి..
యువ నటుడు శివకార్తికేయన్‌కిప్పుడున్న క్రేజ్ ఏమిటన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
తమిళసినిమా: యువ నటుడు శివకార్తికేయన్‌కిప్పుడున్న క్రేజ్ ఏమిటన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుస విజయాలతో యమ జోరులో ఉన్న ఆయన తనతో రొమాన్స్ చేసే హీరోయిన్ల విషయంలోనూ స్థాయిని పెంచుకుంటూ పోతున్నారు. తొలి రోజుల్లో వర్ధమాన నటీమణులతో డ్యూయెట్లు పాడిన శివకార్తికేయన్ మాన్ కరాటే చిత్రంలో తొలిసారిగా క్రేజీ నటి హన్సికతో జోడీ కట్టారు. అప్పట్లో ఈ విషయాన్నే మీడియా ప్రసారం చేసింది.
ఆ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తరువాత రజనీమురుగన్, రెమో చిత్రాల్లో కీర్తీసురేశ్‌తో యుగళగీతాలు పాడారు. అవి సంచలన విజయాలను నమోదు చేసుకోవడంతో ఇప్పుడు అగ్రనాయకిగా రాణిస్తున్న నయనతారతో వేలైక్కారన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. తాజాగా సమంతతో జత కడుతున్నారు. పొన్‌రాం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. తదుపరి నేట్రు ఇండ్రు నాళై చిత్రం ఫేమ్ రవికుమార్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్నారు.
ఆ తరువాత యువ దర్శకుడు విఘ్నేశ్‌శివతో చిత్రం చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారన్నది తాజా సమాచారం. ఇందులో కథానాయకి ఎవరన్నది చర్చనీయాంశంగా మారింది.అయితే ఇందులో నయనతారను నటింపజేయడానికి ఆమెతో చర్చలు జరుగుతున్నాయన్నది కోలీవుడ్ వర్గాల టాక్. దర్శకుడు విఘ్నేశ్‌శివకు నయనతారకు మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందన్న ప్రచారం చాలా కాలంగా సాగుతున్న విషయం తెలిసిందే.
అంతేకాదు ఈ ప్రేమ జంట ఇప్పటికే సహజీవనం సాగిస్తున్నారన్నది ప్రచారంలో ఉన్నదే. అదే విధంగా నయనతార ఇంతకు ముందు తన లవర్‌గా ప్రచారంలో ఉన్న విఘ్నేశ్‌శివ దర్శకత్వంలో నానుమ్‌రౌడీదాన్ చిత్రంలో విజయ్‌సేతుపతికి జంటగా నటించి సక్సెస్‌ను అందుకున్న విషయం తెలిసిందే. మరోసారి విఘ్నేశ్‌శివ దర్శకత్వంలో శివకార్తికేయన్‌తో రొమాన్స్ చేసే అవకాశం మెండుగా ఉందంటున్నారు కోలీవుడ్ వర్గాలు.