వైవిధ్యానికే ఆస్కార్ పట్టాభిషేకం! | oscar award winners and details | Sakshi
Sakshi News home page

వైవిధ్యానికే ఆస్కార్ పట్టాభిషేకం!

Published Tue, Mar 4 2014 1:57 AM | Last Updated on Sat, Sep 2 2017 4:19 AM

వైవిధ్యానికే ఆస్కార్ పట్టాభిషేకం!

వైవిధ్యానికే ఆస్కార్ పట్టాభిషేకం!

 పదమూడున్నర అంగుళాల ఎత్తు, ఎనిమిదిన్నర పౌండ్ల బరువు ఉన్న ఆ బొమ్మ అంటే ప్రతి సినీకళాకారునికీ ఓ క్రేజే! ఆ ప్రతిమ తమ సొంతమైతే జన్మ ధన్యమైనట్లే అనుకుంటారు. 24 కేరట్ల స్వచ్ఛమైన బంగారు పూతతో తయారు చేసిన ఆ ఆస్కార్ ప్రతిమ కోసం ప్రతి ఏడాదీ కళాకారులు ప్రయత్నాలు చేస్తుంటారు. గెల్చుకున్నవాళ్లు ఆనందంతో కూడిన తడబాటుతో వేదిక ఎక్కి, అవార్డు అందుకుంటే, అవార్డు రానివాళ్లు ‘బెటర్ లక్ నెక్ట్స్ టైమ్’ అనుకుని, విజేతలనుఅభినందిస్తుంటారు. ఆదివారం సాయంత్రం లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో 86వ అస్కార్ అవార్డుల వేడుక  వైభవంగా జరిగింది. అంతరిక్ష నేపథ్యంలో తీసిన ‘గ్రావిటీ’ చిత్రాన్ని  7 ఆస్కార్‌లు వరించాయి. బానిసలుగా మారిన సామాన్యుల అంతర్మథనాన్ని ఒడిసిపట్టిన ‘12 ఇయర్స్ ఎ స్లేవ్’ ఉత్తమ చిత్రంగా ఆస్కార్ పట్టం పొందింది. మొత్తానికి 2013 ఆస్కార్ పురస్కారాలను పరిశీలిస్తే.. వైవిధ్యానికి పట్టాభిషేకం చేసినట్టే అనిపిస్తోంది.
 
 
 
 ఆ దేవుడు నా మంచి స్నేహితుడు: మాథ్యూ మెక్ కొనౌఘే
 ఎలక్ట్రీషియన్‌గా, కౌబోయ్‌గా వ్యవహరించే రాన్ ఉడ్‌రూఫ్ అనే వ్యక్తికి ఎయిడ్స్ వ్యాధి సోకుతుంది. 30 రోజుల్లో అతను చనిపోతాడని డాక్టర్లు చెబుతారు. ఆ తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనే కథాంశంతో తీసిన చిత్రం ‘డల్లాస్ బయ్యర్స్ క్లబ్’. ఇందులో ఎయిడ్స్ పేషెంట్‌గా మాథ్యూ మెక్ కొనావ్ నటించారు. ఈ పాత్ర కోసం నాలుగు నెలల్లో దాదాపు 22 కిలోల బరువు తగ్గారు మాథ్యూ. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది.
 
 ఉత్తమ నటుడిగా ఆయన్ను ఆస్కార్ వరించింది. ఈ సందర్భంగా మాథ్యూ మాట్లాడుతూ -‘‘ముందుగా ఆ భగవంతుడికి కృతజ్ఞతలు. ఎందుకంటే, ఎక్కణ్ణుంచి నన్ను చూస్తున్నాడో తెలియదు కానీ, చల్లని చూపు చూస్తున్నాడు. నా చేతుల్లోనే కాదు.. ఇతర మానవులెవరి చేతిలోనూ లేని, కేవలం తనవల్ల మాత్రమే అయిన అవకాశాలన్నీ నాకిస్తున్నాడా దేవుడు. దేవుడి దృష్టి మనవైపు ఉంటే, ఓ మంచి నేస్తం దొరికినట్లే. ఆ నేస్తమే నాకూ ఆస్కార్ బొమ్మని అందించింది’’ అన్నారు.


 
 కథానాయికలూ కనకవర్షం కురిపిస్తారు:కేట్ బ్లాంచెట్
 ధనవంతురాలైన జాస్మిన్ జీవితం చాలా విలాసవంతంగా ఉంటుంది. కానీ, తన జీవితంలో జరిగిన హఠాత్పరిణామాల కారణంగా పేదరాలు అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనే కథతో రూపొందిన చిత్రం ‘బ్లూ జాస్మిన్’. ఇందులో జాస్మిన్‌గా రెండు కోణాలున్న పాత్రను అద్భుతంగా పోషించి, ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డ్ గెల్చుకున్నారు కేట్ బ్లాంచెట్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  తనతో పోటాపోటీగా నిలిచిన జేడ్ డుంచ్, జూలియా రాబర్ట్స్, మెరిల్ స్ట్రీప్, సాండ్రా బుల్లక్‌ల నటనను అభినందించారు. మీరెందులోనూ తక్కువ కాదని ఆమె పేర్కొనడం విశేషం. తన ప్రసంగంలో లేడీ ఓరియంటెడ్ సినిమాల గురించి ఎక్కువగా ప్రస్తావించారు కేట్. ‘‘కథానాయిక ప్రాధాన్యంగా సాగే చిత్రాలు ఆడవని ఎవరన్నారు? హీరోల ఆధిక్యమే ఇక్కడ ఎక్కువ. కానీ, లేడీ ఓరియం టెడ్ చిత్రాలు కూడా ఆడతాయి. కనకవర్షం కురిపిస్తాయి. కథానాయిక ప్రాధాన్యంగా సాగే చిత్రాలను చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. హీరోయిన్ చుట్టూ సాగే ఈ సినిమాకి నన్ను నాయికగా ఎన్నుకున్నందుకు దర్శకుడు ఉడీ ఆలెన్‌కి ధన్యవాదాలు’’ అంటూ ఉద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు.
 
 ఈ అవార్డు బానిసలకు అంకితం: స్టీవ్ మెక్ క్వీన్
 86 ఏళ్ల ఆస్కార్ అవార్డ్స్ చరిత్రలో ఓ నల్ల జాతి దర్శకుడు దర్శకత్వం వహించిన చిత్రానికి     ‘ఉత్తమ చిత్రం’ విభాగంలో అవార్డు దక్కడం విశేషం. బ్రిటిష్ దర్శకుడు స్టీవ్ మెక్ క్వీన్ ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘12 ఇయర్స్ ఎ స్లేవ్’ ఉత్తమ చిత్రం అవార్డు గెల్చుకున్న నేపథ్యంలో చిత్రనిర్మాత బ్రాడ్‌పిట్‌తో కలిసి స్టీవ్ ఆస్కార్ అవార్డ్‌ని అందుకున్నారు. పన్నెండేళ్లు బానిసగా జీవితం నెట్టుకొచ్చిన సాల్మన్ నార్త్‌అప్ రాసిన ‘1853 మెమొయిర్’ పుస్తకం ఆధారంగా ఈ సినిమా తీశారు. ఇప్పటివరకూ బానిసత్వం అనుభవించినవారికి, భవిష్యత్తులో ఈ దౌర్భాగ్య స్థితిలో ఉండబోయేవారికి ఈ అవార్డుని అంకితం చేస్తున్నానని స్వీవ్ అన్నారు.


 
 స్వైన్ ఫ్లూ ఉంటే దూరంగా ఉండండి: జారెడ్
 ‘‘అది 1971. టీనేజ్‌లో ఉన్న ఓ అమ్మాయి తన రెండో బిడ్డను కడుపులో మోస్తోంది. భర్త లేని మహిళ పిల్లలను పెంచడానికి ఎన్ని కష్టాలు పడుతుందో ఆ అమ్మాయి అన్నీ పడింది.     ఆ అమ్మాయి ఎవరో కాదు.. నన్ను కన్న తల్లి. ఆమె ఇచ్చిన ఆత్మస్థయిర్యం దేనితోనూ వెలకట్టలేం. వాస్తవానికి నేనీ వేదికపై నిలవాలని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే, ఆస్కార్ నాకు అందని ద్రాక్ష పండు అనే ఫీలింగ్ ఉండేది. ఇప్పటివరకు నేను యాక్ట్ చేసిన ఏ పాత్రకూ ఒక్క అవార్డు కూడా అందుకోలేదు. తొలి అవార్డే ఆస్కార్ కావడం ఆనందంగా ఉంది’’ అంటూ చుట్టూ గుమిగూడిన మీడియా వారికి, ఇతర ప్రేక్షకులకు ఆస్కార్ ప్రతిమను చూపించి ‘ఎవరికైనా టచ్ చేయాలని ఉందా? కానీ, ఒక నిబంధన. స్వైన్ ఫ్లూ ఉన్నవాళ్లు దూరంగా ఉండండి’ అని జారెడ్ అనడమే ఆలస్యం, ఒక్కొక్కరూ అవార్డును అభిమానంగా తడిమారు. ‘‘మీ ఫింగర్ ప్రింట్స్‌తో నా ఆస్కార్ ప్రతిమకు దుమ్మంటించారు. అందుకు ధన్యవాదాలు’’ అన్నారాయన. ‘డల్లాస్ బయ్యర్స్ క్లబ్’ చిత్రంలో లింగమార్పిడి చేసుకున్న మహిళగా నటించారు జారెడ్. సినిమాలో తను ఎయిడ్స్ పేషెంట్ కూడా. ఈ పాత్ర కోసం ఆయన 23 కిలోలు బరువు తగ్గడం విశేషం. ఫలితంగా ఆయనకు ఉత్తమ సహాయ నటుడి అవార్డు దక్కింది.
 
 నాకు ఆనందం.. మరొకరికి బాధ: లుపిటా
 ‘12 ఇయర్స్ ఎ స్లేవ్’ చిత్రంలో చేసిన పట్సే అనే బానిస పాత్రకు గాను లుపిటా న్యోంగ్యో ఉత్తమ సహాయ నటిగా అవార్డు స్వీకరించారు. ఆమె ప్రసంగం వీక్షకులను కదిలించింది. తనకీ అవార్డు రావడం ద్వారా పోటీలో నిలిచిన ఇతర నటీమణులు ఓడిపోయారని, ఒకరికి ఆనందం, మరొకరికి బాధ మిగలడం విచారకరంగా ఉందని కన్నీటి పర్యంతమవుతూ లుపిటా పేర్కొన్నారు. వెంటనే సంభాళించుకుని, అకాడమీ అవార్డ్స్ కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. అలాగే, ‘పెట్సీ’ ఆత్మ తనని నీడలా వెంటాడి, ఆపాత్రలో జీవించేలా చేసిందని, అందుకని తనకు ధన్యవాదాలని లుపిటా చెప్పడం విశేషం.


 
 91 నిమిషాల ‘గ్రావిటీ’ సినిమాలో 80 నిమిషాల గ్రాఫిక్స్!
 
 ఎస్‌టిఎస్ 157 అనే స్పేస్ షటిల్ మిషన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలో నెలకొనే పలు సమస్యలను ఇద్దరు వ్యోమగాములు ఎలా పరిష్కరించారు? అనేది ఈ చిత్రం ప్రధానాంశం. డా. ర్యాన్ స్టోన్ ( సాండ్రా బుల్లక్), మరో వ్యోమగామి మాట్ కోవాల్స్‌కీ (జార్జ్ క్లూనీ)తో కలిసి అంతరిక్షంలోకి వెళుతుంది. అక్కడ ఈ ఇద్దరూ ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారు? అనే కథాంశంతో ఈ చిత్రం సాగుతుంది. అంతరిక్ష నేపథ్యంలో సాగే త్రీడీ సైంటిఫిక్ థ్రిల్లర్ ఇది. చిత్రదర్శకుడు, నిర్మాతల్లో ఒకరైన అల్ఫాన్సో కౌరన్ తన తనయుడు జోనస్‌తో కలిసి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చారు.
 
  యూనివర్శల్ స్టూడియోస్ కోసం ఈ తండ్రీకొడుకులు కథ సిద్ధం చేశారు. అయితే, స్టోరీ డెవలప్‌మెంట్‌కే కొన్నేళ్లు పట్టింది. కథా హక్కులను వార్నర్ బ్రదర్స్‌కి అమ్మిన తర్వాత వేగం పుంజుకుంది. 2010లో నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక మొదలుపెట్టారు. ఓ ఏడాదిలో సినిమా పూర్తయిపోతుందని అల్ఫాన్సో కౌరన్ అనుకున్నారు. కానీ, నాలుగన్నరేళ్లు పట్టింది. ఒక్క విజువల్ గ్రాఫిక్స్‌కే మూడేళ్లు తీసుకున్నారు. సినిమా నిడివి 91 నిమిషాలైతే... గ్రాఫిక్సే 80 నిమిషాలుంటాయి. చిత్ర బృందం పడిన కష్టమంతా మర్చిపోయేలా ప్రేక్షకులు, సినీ విశ్లేషకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. భాఫ్టా అవార్డ్స్, గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్, ఏడు ఫిలిం క్రిటిక్స్ అవార్డ్స్.. ఇలా ప్రతిష్టాత్మక అవార్డులన్నీ కొట్టేసిందీ చిత్రం. ఆస్కార్ అవార్డ్స్‌లో ఏడు అవార్డులు సాధించి, హాట్ టాపిక్ అయ్యింది. ఈ మధ్యకాలంలో వచ్చిన త్రీడీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్స్ అన్నింటిలోకీ ‘గ్రావిటీ’ కథ, కథనం, టేకింగ్, మేకింగ్ పరంగా అద్భుతంగా ఉండటంతోనే గర్వంగా కాలరెగరేయగలిగింది.


 
 ఈసారీ కాలు జారింది!
 లేత గులాబీ రంగు, తెలుపు కలయికలతో తయారు చేసిన పొడవాటి గౌనులో జెన్నిఫర్ లారెన్స్ ఎర్ర తివాచీపై అడుగుపెట్టగానే అందరి దృష్టి ఒక్కసారిగా ఆమెపై పడింది. చూపులు తిప్పుకోలేనంత ఈ 23ఏళ్ల అందం అందరి కళ్లూ తన మీద ఉండటంవల్లనో ఏమో తడబాటుకి గురయ్యింది. పైగా ఉత్తమ నటి అవార్డు అందుకోబోతున్న ఉద్వేగంతో అడుగులు తడబడ్డాయి. కట్ చేస్తే.. కిందపడిపోయింది జెన్ని. ఇది జరిగినది గతేడాది ఆస్కార్ అవార్డ్ వేడుకలో. ఈసారి కూడా జెన్నీ పడింది. అయితే, అవార్డు ఏమీ లేదు. నామినేషన్ దక్కించుకున్న జెన్నీ ఎరుపు రంగు పొడవాటి గౌను వేసుకుని, అందంగా ముస్తాబై హాజరైంది. ఎర్ర తివాచీపై నడుస్తున్నప్పుడు తన ముందున్న ఓ మహిళ గౌను మీద కాలు వేయడంతో జర్రున జారింది. ఫలితంగా ఈసారి కూడా జెన్నీ పడింది. వచ్చే ఏడాదైనా కాలు జారకుండా జాగ్రత్తపడుతుందో లేదో చూడాలి.


 
 మా సమయం వృథా కాలేదు: అల్ఫాన్సో కౌరన్

 గత ఏడాది బాక్సాఫీస్ దగ్గర కనకవర్షం కురిపించిన చిత్రం ‘గ్రావిటీ’. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు ఓ నిర్మాతగా వ్యవహరించారు అల్ఫాన్సో కౌరన్. ఆస్కార్ అవార్డ్ అందుకున్న తొలి మెక్సికో దేశస్థుడు అల్ఫాన్సోయే కావడం విశేషం. ఈ చిత్రం తీయడానికి ఎన్నో వ్యవ్రపయాసకోర్చారు. కథ తయారు చేయడానికి కొన్నేళ్లు పట్టడంతో పాటు తెరకెక్కించడానికి దాదాపు మూడేళ్లు పట్టింది. కానీ, వివిధ భాగాల్లో ఏడు ఆస్కార్ అవార్డులు సాధించడం ద్వారా తాము పడిన కష్టం, సమయం కూడా వేస్ట్ కాలేదని తన ప్రసంగంలో తెలిపారు అల్ఫాన్సో. ఇంగ్లిష్, స్పానిష్ భాషలో మాట్లాడారాయన.
 
 జంట ఆస్కార్‌లను గెల్చుకున్న ఈ ఇద్దరు!
 ఒక్క ఆస్కార్ అవార్డ్ గెలిస్తేనే మాటల్లో చెప్పలేనంత ఆనందం కలుగుతంది. ఇక, రెండు ఆస్కార్‌లు సొంతం చేసుకుంటే స్వీట్ షాక్ తగిలినట్లే. ఈ ఏడాది ఆ తియ్యని అనుభూతిని సొంతం చేసుకున్నారు అల్ఫోన్సో కౌరన్, కేథరిన్ మార్టిన్. ‘గ్రావిటీ’ చిత్రానికిగాను ఉత్తమ దర్శకుడిగా, ఎడిటర్‌గా రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్నారు అల్ఫోన్సో. తొలి ప్రకటన రాగానే ఎంతగానో ఆనందపడిపోయారు అల్ఫాన్సో. మలి అవార్డు ప్రకటించగానే నోట మాట రాక కాసేపు నిలబడిపోయారు. కేథరిన్ మార్టిన్ పరిస్థితి కూడా ఇదే. ‘ది గ్రేట్ గట్స్‌బి’ చిత్రానికిగాను ఆమె ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ విభాగంలోను, కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలోనూ ఆమె ఆస్కార్ అవార్డులు అందుకున్నారు. 2002లో కూడా ఆమె ‘మౌలిన్ రోగ్’ అనే చిత్రానికి జంట ఆస్కార్‌లు అందుకున్నారు.
 - డి.జి. భవాని


 
 పిజ్జాలు తెప్పించిన యాంకర్!
 ఆమె వయసు 56. మన భారతదేశంలో అయితే, ఆ వయసుకే అంతా అయిపోయిందన్నట్లుగా ఫీలైపోతారు. ముఖ్యంగా ఆడవాళ్లు. కానీ, హాలీవుడ్‌లో సీన్ వేరు. 50, 60, 70, 80.. ఏ వయసైనా సరే యాక్టింగ్‌కి, యాంకరింగ్‌కి అనర్హం కాదు. ఈసారి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఎల్లెన్ డిజెనెరెస్ వయసు 56. స్వతహాగా హాస్య నటి కావడంతో చమక్కులు విసురుతూ రసవత్తరంగా ఈ వేడుకను జరిపారామె. ‘‘మీకు ఆకలిగా ఉంటే పిజ్జా ఆర్డర్ చేస్తా’’ అని ప్రకటించి, మాట మీద నిలబడుతూ, బోల్డన్ని పిజ్జాలు తెప్పించారు.
 
  డెలివరీ బోయ్స్‌తో కలిసి, తను కూడా వీక్షకుల దగ్గరికెళ్లి, పిజ్జాలు అందజేశారామె. అలాగే, ఓ చిన్న బ్రేక్ తర్వాత ఆమె డ్రెస్ మార్చుకుని, దేవకన్యలా ప్రేక్షకుల ముందు ప్రత్యక్షమయ్యారు. 2007 తర్వాత ఆస్కార్ అవార్డ్స్ వేడుకకు ఎల్లెన్ వ్యాఖ్యాతగా వ్యవహరించడం ఇదే. ఏడేళ్ల క్రితం  ఎంత జోష్‌గా నిర్వహించారో ఇప్పుడు కూడా అంతే హుషారుగా ఆమె వ్యాఖ్యానం చేయడం వీక్షకులను ఆశ్చర్యపరిచింది.
 
 86వ ఆస్కార్ అవార్డ్స్ విజేతలు
 
  ఉత్తమ చిత్రం: 12 ఇయర్స్ ఎ స్లేవ్


 ఉత్తమ నటుడు: మాథ్యూ మెక్ కొనౌఘే (డల్లాస్ బయ్యర్స్ క్లబ్)


 ఉత్తమ నటి: కేట్ బ్లాంచెట్ (బ్లూ జాస్మిన్)


 ఉత్తమ సహాయ నటుడు: జారెడ్ లెటో (డల్లాస్ బయ్యర్స్ క్లబ్)


 ఉత్తమ సహాయ నటి: లుపిటా న్యోంగ్యో (12 ఇయర్స్ ఎ స్లేవ్)


 ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్: ఫ్రోజెన్ (క్రిస్ బక్, జెన్నిఫర్ లీ, పీటర్ డి)


 ఉత్తమ సినిమాటోగ్రఫీ: గ్రావిటీ (ఎమ్మాన్యూయెల్ లుబెజ్కి)


 ఉత్తమ వస్త్రాలంకరణ: ది గ్రేట్ గట్స్‌బై  (కేథరిన్ మార్టిన్)


 ఉత్తమ దర్శకుడు: గ్రావిటీ (ఆల్ఫాన్సో కౌరన్)


 ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్: 20 ఫీట్ ఫ్రం ఫ్రీడమ్


 ఉత్తమ లఘు డాక్యుమెంటరీ: ది లేడీ ఇన్ నంబర్.6: మ్యూజిక్ సేవ్డ్ మై లైఫ్ (మాల్కోల్మ్‌క్లార్క్, నికోలస్ రీడ్)


 ఉత్తమ చిత్ర సంపాదకత్వం: గ్రావిటీ (ఆల్ఫాన్సో కౌరన్, మార్క్ సంగేర్)


 ఉత్తమ పరభాషా చిత్రం: ది గ్రేట్ బ్యూటీ (ఇటలీ)


 ఉత్తమ అలంకరణ మరియు  కేశాలంకరణ: డల్లాస్ బయ్యర్స్ క్లబ్ (అదృఇత లీ, రాబిన్ మాథ్యూస్)


 ఉత్తమ ఒరిజినల్ స్కోర్: గ్రావిటీ  (స్టీవెన్ ప్రైస్)


 ఉత్తమ ఒరిజినల్ సాంగ్: లేట్ ఇత్ గో (ఫోర్జెన్)


 ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: ది గ్రేట్‌గట్స్‌బై (కేథరిన్ మార్టిన్, బెవర్లీ డున్)


 ఉత్తమ యానిమేషన్ లఘు చిత్రం: మిస్టర్ హుబోల్ట్ (లారెంట్ విట్జ్, అలెగ్జాండ్రె, ఎస్పిగేర్స్)


 ఉత్తమ ప్రత్యక్ష ప్రసార లఘు చిత్రం: హీలియం (అండర్స్ వాల్టర్, కిం మాగ్నస్సన్)


 ఉత్తమ శబ్ద సంపాదకత్వం: గ్రావిటీ (గ్లైన్ ఫ్రీమాంట్లే)


 ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: గ్రావిటీ (తిం వెబ్బెర్, క్రిస్ లారెన్స్, దేవ్ పిర్క్, నీల్ కార్బౌల్డ్)


 ఉత్తమ అడాప్ట్ స్క్రీన్‌ప్లే: 12 ఇయర్ ఎ స్లేవ్ (జాన్ రైడ్లీ)


 బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: హర్ (స్పైక్ జొన్జే)
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement