
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా అప్ డేట్స్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. దాదాపుగా షూటింగ్ చివరి దశకు చేరుకున్నా ఇంత వరకు టైటిల్ మాత్రం ప్రకటించలేదు. గతంలో పవన్ పుట్టిన రోజు సందర్భంగా చిన్న మ్యూజికల్ టీజర్‌ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్, తాజాగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా పూర్తి పాటతో పాటు లిరికల్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. అయితే సినిమా టైటిల్‌పై క్లారిటీ వస్తుందని ఆశించిన అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది.
రాత్రి 12 గంటలకు ‘బయిటికొచ్చి చూస్తే’ ఆడియో సాంగ్ ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్, ఉదయం 10 గంటలకు లిరికల్ వీడియోనే రిలీజ్ చేశారు. అనిరుద్ రవిచందర్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ పాటకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. వీడియో రిలీజ్ అయిన అరగంటలోనే ఈ పాటకు లక్షకు పైగా వ్యూస్ రావటం విశేషం. పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూల్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధకృష్ణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఫారిన్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను జనవరి 10న రిలీజ్ చేయనున్నారు.