పెళ్లి పుస్తకం @ 25 | Pelli pustakam-25years | Sakshi
Sakshi News home page

పెళ్లి పుస్తకం @ 25

Published Fri, Apr 1 2016 1:22 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

పెళ్లి పుస్తకం @ 25 - Sakshi

పెళ్లి పుస్తకం @ 25

ప్రముఖ దర్శకుడు బాపు గీత గీసి... ముళ్లపూడి వెంకటరమణ రాత రాసి... శ్రీకారం చుట్టిన 'పెళ్లి పుస్తకం' చిత్రరాజానికి నేటికి అంటే ఏప్రిల్1వ తేదీకి 25 ఏళ్లు పూర్తయ్యాయి. 1991 ఏప్రిల్ 1న టాలీవుడ్లో విడుదలై ఈ చిత్రం ఓ చరిత్ర సృష్టించింది. హీరోహీరోయిన్లుగా నట కిరిటీ రాజేంద్ర ప్రసాద్ కృష్ణమూర్తిగా అలియాస్ కేకేగా... దివ్యవాణి సత్యభామగా ఎవరి పాత్రలో వారు ఒదిగిపోయారు.

అయితే గతంలో వచ్చిన చిత్రాలు... అంటే మిస్సమ్మ (పాతది) లో ఉద్యోగం కోసం ఎన్టీఆర్, సావిత్రి భార్యాభర్తలుగా కలసి నటిస్తే... అందుకు విరుద్ధంగా పెళ్లి పుస్తకం చిత్రంలో మాత్రం రాజేంద్రప్రసాద్, దివ్యవాణి పెళ్లి చేసుకుని... ఉద్యోగం కోసం ఇద్దరు శ్రీధరరావు పాత్రలో లీనమైన గుమ్మడి వెంకటేశ్వరరావు కంపెనీలో ఆర్టిస్ట్ ఉద్యోగాన్ని కృష్ణమూర్తి....  అదే సంస్థలో పీఏ ఉద్యోగాన్ని సత్యభామా సంపాదించి ఒకరి గురించి ఒకరికి తెలియనట్లు ఆయా పాత్రలో జీవించారు.

కంపెనీ యజమానిగా గుమ్మడి వెంకటేశ్వరరావు నేనూ.. అంటూ మాటమాటని కట్ చేసి వెరైటీ స్లాంగ్లో మాట్లాడుతుంటే... రావి కొండలరావు మాత్రం అదే సంస్థలో పని చేసే ఉద్యోగుల చేత బాబాయిగా పిలిపించుకుంటూ ... బధిర వార్తల చదువుతున్నట్లు సైగలతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు.

ఒకానొక సమయంలో హీరోయిన్ దివ్యవాణి చేత ఇస్త్రీ పెట్టితో వాత కూడా పెట్టించుకుంటాడు. ఇక గిరి పాత్రలో నటించిన శుభలేక సుధాకర్ విషయానికి వస్తే... గుమ్మడి బావమరిదిగా నటిస్తూ...  దివ్యవాణిపై మనసు పడి... ఆ తర్వాత అక్కతో కొట్టింగు పడే సన్నివేశాలు లోలోన నవ్వు పుట్టిస్తాయి. 

ఇక సెకండ్ హీరోయిన్గా వచ్చిన గుమ్మడి కుమార్తె వసుంధర పాత్రలో నటించిన సింధుజా కూడా హీరో రాజేంద్రప్రసాద్ వెంట పడి... అతడి భార్య దివ్యవాణి అసూయకు కారణమవుతుంది. కానీ సింధుజాది అంతా నటన అని చివరకు తెలుసుకుంటుంది. అలాగే చిత్రంలోని బ్రహ్మచారి గదులకు భామలే అందం, పెళ్లికి పునాది నమ్మకం, గౌరవం, నవ్వొచ్చినప్పుడు ఎవడైనా నవ్వుతాడు. ఏడుపొచ్చినప్పుడు నవ్వే వాడే హీరో, అసూయ అసలైన ప్రేమకి ధర్మామీటర్, నమ్మకం లేని చోట నారాయణా అన్నా బూతులాగే వినిపిస్తూంది... లాంటి డైలాగులు ఎన్నో ప్రేక్షక దేవుళ్ల చేత చపట్లు కొట్టించాయి.

పాటలు అయితే ఇక చెప్పనక్కరలేదు. ఆరుద్ర గారి చేతి నుంచి జాలు వారిన శ్రీరస్తూ...శుభమస్తూ పాట అప్పటి వరకు తెలుగు ప్రజల లోగిళ్లలో ఎక్కడ పెళ్లి బాజా భజింత్రులు మోగిన... వినిపించే సీతారాముల కళ్యాణం చూతమురారండి అంటూ సాగే పాటను పక్కకు నెట్టింది. శ్రీరస్తూ... శుభమస్తూ శ్రీకారం చుట్టుకుంది ...అంటూ సాగే పాట ఆఖరికి టీవీ సీరియళ్లలో వచ్చే పెళ్లీ సీనుల్లో ఈ వినిపిస్తూంది. 

మామా కె.వి. మహాదేవన్ సంగీత దర్శకత్వంలో ట్యూన్ కట్టిన అమ్మకుట్టి అమ్మ కుట్టి మనస్సు లోయో..... , కృష్ణం కలయసఖి సుందరం.... , పపపప పప పప్పు దప్పళం అన్నం నెయ్యి...,  హాయి హాయి శ్రీరంగ సాయి..., సరికొత్త చీర ఊహించినాను.... పాటలు ప్రేక్షక మహాశయులనే కాదు, సంగీత ప్రియులను ఒలలాడించింది. పెళ్లికి అర్థాన్నీ, పరమార్దాన్నీ ఇంత సున్నితంగా, హృద్యంగా అందంగా ,రొమాంటిగ్గా అన్నింటినీ మించి హాస్య భరితంగా చెప్పిన చిత్రం ఈ పెళ్లి పుస్తకం. శ్రీసీతారామా బ్యానర్ పై ఈ చిత్రం రూపొందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement