
సాక్షి, ముంబై : బాలీవుడ్ బాద్ షా 53వ వసంతంలోకి అడుగుపెట్టారు. షారుఖ్‌ఖాన్ పుట్టినరోజు (నవంబర్ 2) సందర్భంగా ఆయన నటించిన ‘జీరో’ ట్రైలర్ కూడా అదే రోజు విడుదల కావడంతో ఆయన బిజీబిజీగా గడిపారు. అనంతరం బాలీవుడ్ సెలబ్రిటీలకు, ఫ్రెండ్స్‌కు బాంద్రాలోని ‘అర్ధ్’ నైట్ క్లబ్‌లో పార్టీ ఇచ్చారు. అయితే ఈ ప్రైవేటు కార్యక్రమానికి పోలీసులూ హాజరయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా పార్టీ నిర్వహిస్తున్నారని అభ్యంతరం తెలిపారు. చెవులు చిల్లులు పడేల హోరెత్తుతున్న మ్యూజిక్‌ను ఆపేశారు. (బాల్కనీలో నుంచుని చేతులు జోడించిన షారుఖ్)
సాదారణంగా రాత్రి ఒంటిగంట వరకే నైట్‌క్లబ్బులకు పర్మిషన్ ఉంటుంది. అప్పటికే రాత్రి 3 గంటలయినా షారుఖ్ అతని మిత్రులు పాల్గొన్న ‘అర్ధ్’క్లబ్ తెరిచే ఉందని పోలీసులు తెలిపారు. బాద్‌షా పార్టీ కోసం అక్కడున్న వారందరినీ అప్పటికే పంపేశారని అన్నారు. రాత్రి 3 దాటినా ‘అర్థ్’ ఇంకా తెరచే ఉందని సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్నామని పోలీసులు వెల్లడించారు. దీంతో షారుఖ్ అతని ఫ్రెండ్స్ త్వత్వరగా పార్టీ ముగించుకొని వెళ్లిపోయారని తెలిపారు. ఇదిలాఉండగా.. పోలీసుల రాకను ముందే పసిగట్టిన మరికొందరు బాలీవుడ్ ప్రముఖులు కూడా అప్పటికే క్లబ్ నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం.