
ప్రభుదేవా
కృష్ణమనోహర్ ఐపీఎస్ అనగానే ప్రేక్షకులకు తెలుగు సూపర్‌హిట్ ‘పోకిరి’ సినిమాలో మహేశ్‌బాబు చేసిన పాత్ర ఇట్టే గుర్తుకు వస్తుంది. ఈ పాత్ర పేరే టైటిల్‌గా ఇప్పుడు ఓ సినిమా విడుదలకు సిద్ధమైంది. ప్రభుదేవా హీరోగా నటించిన తాజా తమిళ చిత్రం ‘పొన్ మాణిక్యవేల్’ని ‘కృష్ణమనోహర్ ఐపీఎస్’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటించారు.
ముఖిల్ చెల్లప్పన్ దర్శకుడు. పవన్‌పుత్ర ప్రొడక్షన్స్ పతాకంపై యనమల సుధాకర్‌నాయుడు సమర్పణలో ఆర్. సీతారామరాజు ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘‘సంఘవిద్రోహుల పాలిట సింహస్వప్నంలా వీరవిహారం చేసే ఓ పోలీసాఫీసర్ కథ ఇది. ప్రభుదేవా, నివేదా నటన హైలైట్. ఈ చిత్రాన్ని వచ్చే నెలలో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘బాహుబలి’ ప్రభాకర్, సురేష్ మీనన్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు డి. ఇమ్మాన్ స్వరకర్త.