
అందుకే బ్రహ్మోత్సవం...ప్రతి హృదయాన్ని కదిలిస్తోంది
బాపుగారి బొమ్మని తలపించే అందం ప్రణీత సొంతం. అలాంటి అమ్మాయి లంగా, ఓణి, పరికిణీలతో కనిపిస్తూ బావా.. బావా అంటూ సందడి చేస్తే వెండితెరకి వచ్చే కళే వేరు. అందుకే ప్రణీతని దర్శకులు మరదలు పాత్రల్లో చూపించడానికి ఇష్టపడుతుంటారు. ‘బావ’ సినిమానే తీసుకోండి. అందులో ప్రణీత మరదలు పిల్లే. ‘అత్తారింటికి దారేది’లోనూ అంతే. పవన్‌కల్యాణ్‌కి మరదలే అవుతుంది. శుక్రవారం వచ్చిన ‘బ్రహ్మోత్సవం’లోనూ మహేశ్ మరదలిగా నటించింది. ఆ పాత్రల్లో అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా కనిపిస్తూ ప్రణీత సందడి చేస్తున్న విధానం కుర్రకారుకు భలే నచ్చుతోంది. ‘‘మరదలిగానే కావచ్చు గానీ ‘బ్రహ్మోత్సవం’లో నా పాత్ర కొత్త కోణంలో ఉంటుంది. ఇందులో భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని ఆక ట్టుకొనే ప్రయత్నం చేశా’’ అంటున్న ప్రణీతతో ‘సాక్షి’ స్పెషల్ చాట్...
♦ నేను నటించిన మంచి చిత్రాల్లో ‘బ్రహ్మోత్సవం’ ఒకటి. కుటుంబ అనుబంధాల నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రతి హృదయాన్ని కదిలించే విధంగా ఉంటుంది. అందుకే ఈ కథ వినగానే నేను వెంటనే కనెక్ట్ అయిపోయా. పాత్రకి సంబంధించి కూడా ప్రతి అణువణువూ ఆస్వాదించా. ముఖ్యంగా నా పాత్ర తన మనసులోని భావోద్వేగాలను బయటపెట్టే విధానం స్వతహాగా నాకు భలే నచ్చింది. సినిమా పేరుకు తగ్గట్టుగానే సెట్లో ఉత్సవ వాతావరణం కనిపించేది. అందుకే షూటింగ్ జరుగుతున్నట్టు అనిపించేదే కాదు. మహేశ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఒక మంచి అనుభూతి. ఆయన సెట్స్‌లో ఎప్పుడూ సరదాగా కనిపిస్తుంటారు. ఆయనతో షూటింగ్ అంటే బోల్డెంత ఫన్. ముఖ్యంగా మహేశ్‌తో కలిసి నేను చేసిన సన్నివేశాలు నాకు నటిగా మరింత సంతృప్తినిచ్చాయి.
ఆస్వాదిస్తున్నారు
కుటుంబం చుట్టూ సాగే కథ ‘బ్రహ్మోత్సవం. స్వతహాగా నాకు కుటుంబంతో అనుబంధం ఎక్కువ. కాబట్టి ప్రతి సన్నివేశంలోనూ నాకు నేను, నా కుటుంబం కనిపించేది. అందుకేనేమో ఏ దశలోనూ నేనేదో సినిమా చేస్తున్నట్టు, నటిస్తున్నట్టు అనిపించేది కాదు. ఇలాంటి నేపథ్యంతో కూడిన సినిమాల్లో నటించడమంటే చాలా ఇష్టం. భవిష్యత్తులోనూ కుటుంబ నేపథ్యంతో కూడిన సినిమాలు మరిన్ని చేస్తా. ‘బ్రహ్మోత్సవం’లో ప్రేక్షకుల్ని అలరించే అంశాలు భావోద్వేగాలే.
♦ ఇలాంటి చిత్రాలు ఎప్పుడో కానీ రావు. అందుకే ప్రేక్షకులు ప్రతి సన్నివేశాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇందులో ముగ్గురు కథానాయిక లున్నప్పటికీ మా అందరి పాత్రలకీ సమ ప్రాధాన్యం దక్కింది. ప్రతి పాత్ర కూడా కథని ఎంతో కొంత ప్రభావితం చేస్తుంటుంది. అందుకే ఇందులో కథానాయికలు ఎంత మంది అనే విషయాన్ని పట్టించుకోలేదు. సమంత, కాజల్‌లతో కలిసి నటించడం చాలా ఆనందాన్నిచ్చింది.