ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్
ఎవరికి ఎవరితో ఎలా ముడిపడుతుందో ఊహించలేం, అంచనా వేయలేం. ఈ గట్టు ఉన్నవాళ్లు ఈ గట్టుతోనే కాదు... ఒక్కోసారి ఆ గట్టుతోనూ కనెక్ట్ అవుతుంటారు. ప్రేమ ఎంత మేజిక్ చేస్తుందంటే కొన్ని సముద్రాల అవతల ఉన్నవాళ్లను కూడా కలిపేస్తుంది. ఇప్పుడు ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్ అందుకు ఓ ఉదాహరణ. అసలు అమెరికా కుర్రాడు నిక్, దేశీ వనిత ప్రియాంకకీ మధ్య ప్రేమ ఎలా మొదలైంది? అనే ‘బ్యాక్‌స్టోరీ’ తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది.
ప్రియాంకా చోప్రాను కలుసుకున్న మొదటిసారే ప్రియాంక కోసం మోకాళ్ల మీద నిల్చున్నాడట నిక్. మూడో డేట్‌లోనే ‘ప్రియాంకతోనే జీవితాన్ని పంచుకోవాల’ని నిశ్చయించుకున్నాడట. ప్రియాంకతో తనది మూడో జన్మలా భావిస్తున్నాడట. ఇవాళ పెళ్లితో ఒకింటివాళ్లు కాబోతున్నారు ప్రియానిక్. ఈ సందర్భంగా ఈ జంట లవ్‌స్టోరీ తెలుసుకుందాం. ఓ ప్రముఖ హాలీవుడ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక తన లవ్ జర్నీని షేర్ చేసుకున్నారు. ఆ ముచ్చట్లు ఈ విధంగా...
గతేడాది జరిగిన ‘మెట్ గాలా 2017’ ఈవెంట్‌లో ఫస్ట్ టైమ్ అఫీషియల్‌గా మీడియా ముందు కనిపించారు నిక్– ప్రియాంకా చోప్రా. కానీ ఇది జరగకముందు... అంటే ఏడాది క్రితమే వీళ్లకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఒకరినొకరు తరచూ కలుసుకునేవాళ్లు. ఒకరి ఫోన్లకు ఒకరు మెసేజ్‌ల వర్షం కురిపించుకునేవారు.
క్వాంటికో సిరీస్ సీజన్ 1
‘ప్రియాంకా ఈజ్ వావ్’ అని ‘క్వాంటికో’లో ప్రియాంక కోస్టార్ గ్రహమ్ రోజర్‌కు ఓ మెసేజ్. పంపింది నిక్ జోనస్. ఆ తర్వాత ధైర్యం కూడదీసుకుని ‘నా స్నేహితుల ద్వారా నీ గురించి చాలా వింటున్నాను. మనం కలవొచ్చేమో?’ అని ట్వీటర్‌లో ప్రియాంకకు మెసేజ్ చేశాడు. 24 గంటల సుదీర్ఘ ఎదురుచూపుల తర్వాత ‘‘మా టీమ్ ఈ మెసేజ్ చూడగలదు. డైరెక్ట్‌గా మెసేజ్ ఎందుకు చేయకూడదు’ అని రిప్లై ఇచ్చింది ప్రియాంక. అలా మెసేజ్‌లు అటు ఇటు ప్రయాణం చేయడం మొదలైంది.
ఫిబ్రవరి, 2017 ఆస్కార్ వేనిటీ పార్టీ
ఆస్కార్ వేనిటీ ఫేర్ పార్టీలో నిక్ బార్‌లో కూర్చొని ఉన్నాడు. ప్రియాంక కూడా అక్కడే ఉంది. ప్రియాంక సందడిని గమనిస్తూనే ఉన్నాడు నిక్. అటూ ఇటూ తిరుగుతోంది ప్రియాంక. ఏదో నిశ్చయించుకున్నట్లుగా తన సీట్ దగ్గర నుంచి లేచి ప్రియాంకా దగ్గరకు వెళ్లాడు నిక్. చుట్టూ ఉన్న జనాన్ని కూడా పట్టించుకోలేదు, ‘‘నువ్వు నిజాయితీగా కనిపిస్తున్నావు. ఇన్నేళ్లు నాకెందుకు కనిపించలేదు’’ అంటూ మోకాళ్ల మీద కూర్చుని ప్రియాంకాతో అన్నాడు. అది వాళ్లిద్దరూ వ్యక్తిగతంగా కలిసిన ఫస్ట్ పార్టీ.
మే, 2017.. మెట్ గాలా
ఏడాదిన్నరగా మెసేజ్‌లు చేసుకుంటూనే ఉన్నారు ప్రియాంక, నిక్. ఫ్యాషన్ డిజైనర్ రాల్ఫ్ లారెన్ వాళ్లిద్దర్నీ మెట్ గాలా ఈవెంట్ 2017కి ఆహ్వానించాడు. ఆ ఈవెంట్‌కు హాజరయ్యే వారం ముందే డ్రింక్స్ పార్టీలో కలుసుకున్నారు. అదే మీటింగ్‌లో నిక్‌ను తన అపార్ట్‌మెంట్‌కు ఆహ్వానించింది ప్రియాంక. అక్కడ వాళ్ల అమ్మగారిని కూడా కలిశాడు నిక్. ఇలా ఇద్దరి మధ్యలో జోక్స్, కెమిస్ట్రీ, సైగలు, సూచనలు కొనసాగుతున్నాయి. ఈ ప్రయాణం ఎటు తీసుకెళ్తుందో కొంచెం కొంచెంగా అర్థమౌతోంది ప్రియాంకకు.
నీ పట్టుదల అంటే ఇష్టం: నిక్
ఓసారి లాస్ ఏంజల్స్‌లో టైమ్ గడుపుతున్నారు ఇద్దరూ. ‘‘ప్రపంచాన్ని నువ్వు చూసే తీరు నన్ను ఆశ్చర్యపరుస్తుంది. నీ పట్టుదల నాకెంతో ఇష్టం’’ అని ప్రియాంక గురించి తనకు అనిపించింది వ్యక్తపరిచాడు నిక్. సాధారణంగా ఆడవాళ్ల అందాన్ని మాత్రమే గమనించి, గుర్తించి అభినందిస్తుంటారు. కానీ ప్రియాంక ప్రయాణాన్ని, పట్టుదలను అభినందించాడు నిక్. నిజమే టీనేజ్‌లోనే మిస్ ఇండియా అవార్డ్ సాధించి, ఆ తర్వాత బాలీవుడ్‌లో టాప్ స్టార్స్‌తో సినిమాల్లో కనిపించింది. ఉత్తమ నటిగా (‘ఫ్యాషన్’ సినిమా) నేషనల్ అవార్డ్ కూడా అందుకుంది. అక్కడితో సరిపెట్టుకోలేదు. చప్పట్లకు అలవాటు పడ్డ చెవులు కదా. నటిగా తనని తాను విస్తరింపజేసుకోవాలనుకుంది. అప్పటి వరకూ ఏ స్టార్ చేయని సాహసం చేసింది. హాలీవుడ్‌కు ప్రయాణం మొదలెట్టింది. ‘ఇప్పటి వరకూ హాలీవుడ్‌లో ఎవరూ కొనసాగలేకపోయారు. నిలదొక్కుకోలేవు. ఇక్కడి కెరీర్ వదిలేసి రిస్క్ ఎందుకు చేస్తున్నావు’ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. వాళ్ల సలహాలను పట్టించుకోలేదు. ఫస్ట్ ఆల్బమ్ ‘ఇన్ మై సిటీ’ చేసింది. మిశ్రమ స్పందన. ఆ తర్వాత ‘క్వాంటికో’ టీవీ సిరీస్‌కి చాన్స్ వచ్చింది. అంతే.. వెనక్కి తిరిగి చూసుకునే పనిలేకుండా పోయింది. సిరీస్ సూపర్ హిట్. మూడు సీజన్స్ వరకూ కొన సాగింది. ‘నీ పట్టుదల నాకిష్టం’ అని నిక్ అన్నప్పుడు ప్రియాంక ఇలా తన మనసులో కెరీర్‌ని విశ్లేషించుకుని ఉంటుంది. బాహ్య సౌందర్యానికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వకుండా తన ప్రతిభను గుర్తించాడనే కారణంతో నిక్ మీద ఆమెకు ఇష్టం మొదలై ఉండొచ్చు.
కొత్త చాప్టర్
ఆ తర్వాత ఇద్దరూ మళ్లీ చాలా కాలం కలుసుకోలేదు. ఓ షో కోసం ప్రియాంకను ఆహ్వానించాడు నిక్. ‘‘తను నా దగ్గరకు రాగానే ఓ ప్రశాంతత తీసుకొచ్చినట్లనిపించింది. జీవితంలో కొత్త చాప్టర్ మొదలుపెట్టాలనే భావన’’ అని సన్నిహితులతో అన్నాడు నిక్. అది వాళ్లిద్దరికీ మూడో డేట్. అప్పటికే ఫిక్స్ అయిపోయాడు నిక్. ఆ మరుసటి రోజు తన తల్లికి ఫోన్ చేసి, ప్రియాంకను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని అన్నాడు.
జూలై, 2018
క్రీట్.. గ్రీక్ దేశం. ప్రియాంక చోప్రా బర్త్‌డే హాలీడేలో ఉంది. నిక్ కూడా ఆమెతో ఉన్నాడు. ‘‘నన్ను పెళ్లి చేసుకుని, ప్రపంచంలోనే సంతోషమైన వ్యక్తిని చేస్తావా’’ అని మోకాళ్ల మీద నిలబడి అడిగాడు నిక్ ప్రేమగా. 45 క్షణాల మౌనం. ఆశ్చర్యంలో ఉండిపోయింది ప్రియాంక. ‘‘నీకు ఏ అభ్యంతరం లేకపోతే ఈ ఉంగరం నీ వేలికి తొడగాలనుకుంటున్నాను’’ అన్నాడు. ప్రియాంక నవ్వుతూ తన అంగీకారాన్ని తెలిపింది. ఆ తర్వాత అన్నీ చకచకా జరిగిపోయాయి
ఏడు జన్మల ప్రేమ!
వేరు వేరుగా ఉన్న మన సంస్కృతులు, సంప్రదాయాలు మనల్ని వేరు చేయకూడదు. మనల్ని భిన్నంగా చూపించేవే మన సంస్కృతులు అంటారు ప్రియాంక. ‘‘ఏడు అడుగులు నడిచి ఏడు జన్మలు కలిసుంటారని అంటుంటారు. మాకిది ఆల్రెడీ మూడో జన్మలా అనిపిస్తోంది’’ అని చెప్పుకొచ్చాడు నిక్. అంతటితో ఆగలేదు.. ప్రియాంకతో మరో ఏడు జన్మల ప్రేమ కావాలని అన్నాడు నిక్. చదువుతుంటే ప్రియాంక అంటే అతనికి ఎంత ప్రేమో అర్థమవుతోంది కదూ. ప్రియాంక కూడా నిక్‌కి అంతే ఇష్టంగా దగ్గరైంది. వాళ్ల ప్రేమ ఇలానే కొనసాగాలని కోరుకుందాం. శతమానం భవతి.
Comments
Please login to add a commentAdd a comment