
ప్రియాంక... కెజుకెన్బో!
సినిమాల్లో తమ పాత్రల కోసం ఎంత కష్టాన్నైనా ఓర్చుకుని, వాటికి వన్నె తెచ్చే నటీమణుల్లో ప్రియాంకా చోప్రా ఒకరు. ఆ మధ్య ప్రియాంక నటించిన ‘మేరీ కోమ్’ చిత్రం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. మేరీ కోమ్ పాత్ర కోసం బాక్సింగ్ నేర్చుకుని, ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారామె. ఆ సినిమాలో అనేక రిస్కీ షాట్స్ చేసి భేష్ అనిపించుకున్నారు. తాజాగా ‘బేవాచ్’ అనే హాలీవుడ్ చిత్రం కోసం ప్రియాంక ఓ మార్షల్ ఆర్ట్ నేర్చుకోనున్నారు.
కరాటే, బాక్సింగ్, జూడో లాంటివన్నీ మార్షల్ ఆర్ట్స్ అనే విషయం తెలిసిందే. అయితే, ప్రియాంక ‘బేవాచ్’ కోసం ‘కెజుకెన్బో’ అనే మార్షల్ ఆర్ట్ నేర్చుకోనున్నారు. ఇది అమెరికాలో ప్రసిద్ధి చెందిన మార్షల్ ఆర్ట్. కరాటే, కొరియన్ కరాటే, జూడో, కెన్బో, వెస్ట్రన్, చైనీస్ బాక్సింగ్ లాంటి ఆరు మార్షల్ ఆర్ట్స్ కలిపిన విశేషమైన యుద్ధవిద్య ‘కెజుకెన్బో’. ఇది నేర్చుకోవాలంటే చిన్న విషయం మాత్రం కాదట.
అయినప్పటికీ ప్రియాంకా చోప్రా వెనకడుగు వేయలేదని సమాచారం. ‘బేవాచ్’లో తాను చేస్తున్న విలన్ పాత్రకు పూర్తి న్యాయం చేయాలంటే ఎంత రిస్కీ మార్షల్ ఆర్ట్ అయినా నేర్చుకోవాలని ఫిక్స్ అయ్యారట. హీరో డ్వేన్ జాన్సన్‌కు దీటుగా ఉండే ఆమె పాత్రకు కెజుకెన్బో వస్తే బాగుంటుందని చిత్ర దర్శకుడు సేథ్ గోర్డన్ సూచించారట. అందుకే అమెరికాలో ఈ విద్యలో ప్రసిద్ధిగాంచిన ఓ ట్రైనర్ ఆధ్వర్యంలో నేర్చుకోవడానికి ప్రియాంక సై అన్నారు. మరి.. ప్రియాంకానా... మజాకానా!