
రాధికా ఆప్టే
సాక్షి, సినిమా: వివాదాస్పద నటీమణుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న వారిలో రాధికా ఆప్టే ఒకరని చెప్పొచ్చు. తన వ్యక్తిగత విషయాలను బహిరంగపరచి సంచలనానికి తెరలేపారు. ఇటీవల ఒక దక్షిణాది నటుడు తనను పడకగదికి పిలిచారని ఆరోపణలతో కలకలం సృష్టించింది. ఇక రాధిక తరచూ గ్లామరస్ ఫొటోలను ఇంటర్నెట్‌లో పోస్ట్ చేస్తూ నెటిజన్లకు చేతినిండా పని చెబుతూ వారి విమర్శలను ఎదుర్కొంటోంది. అయితే హిందీ చిత్రాల్లో విచ్చలవిడిగా తన అందాలను ఆరబోసి నటించడం కూడా విమర్శలకు దారి తీస్తోంది. ఈ విషయంలో నా శరీరం నా ఇష్టం అని ఇప్పటివరకూ ఎదురుదాడి చేసిన రాధిక ఇప్పుడు తాను గ్లామరస్‌గా నటించిన మాట నిజమేనని అంగీకరించింది. అందుకు కారణం కూడా చెప్పింది.
ఇంతకీ రాధికా ఏం చెప్పారో చూద్దాం.. ‘సినిమా రంగంలో బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వారికి అవకాశాలు సులభంగా లభిస్తాయి. అలా సినీ నేపథ్యం లేని వారు చాలా కష్టపడాల్సిందే. నాకు సినిమారంగంలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు. అందుకే నేను చాలా కష్టపడ్డాను. చాలా సమస్యలను ఎదుర్కొన్నాను. ఈ రంగంలో ఎలాంటి చిత్రాల్లో నటించకూడదని భావించానో, డబ్బు కోసం అలాంటి చెత్త చిత్రాల్లో నటించాల్సి వచ్చింది. జీవనాధారం కోసం అలాంటి అడ్డమైన చిత్రాలను నిరాకరించలేకపోయాను. అయితే ఇప్పుడు నేను పేరు, డబ్బు సంపాదించుకున్నాను. అవకాశాలు చాలానే వస్తున్నాయి. ప్రస్తుతం అన్నీ అంగీకరించడం లేదని, నచ్చిన కథ నచ్చితేనే ఓకే చెబుతున్నా’ అని చెప్పుకొచ్చారు.